ఎన్నికల షెడ్యూల్… నేడు టీడీపీ తొలి జాబితా?

మరి కొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్.. నేడు టీడీపీ తొలి జాబితా?
ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు

1.పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బాబు సమీక్షలు.
2.దాదాపు సిట్టింగ్‌లకే సీట్లు ఖరారు చేస్తోన్న టీడీపీ అధినేత.
3.100 మందితో టీడీపీ తొలిజాబితా నేడు ప్రకటన అంటూ ప్రచారం.

గతంలో ఎన్నడూ లేనివిధంగా బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తుగా సమీక్షలు నిర్వహించి టిక్కెట్లను ఖరారు చేస్తున్నారు.

గత నెల రోజుల నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కొన్ని స్థానాల తప్ప మిగతా వాటిలో అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తిచేశారు.

తాజాగా అరకు పార్లమెంటు పరిధిలోని శాసనసభ నియోజకవర్గం నేతలతో ఆదివారం సమావేశం కానున్నారు.

ఇప్పటికే అరకు ఎంపీ టిక్కెట్‌ను ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌కు ఖరారు చేశారు. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపిక నేడు పూర్తిచేయనున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని శాసనసభ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.

విశాఖ జిల్లాలోని అరకు, రంపచోడవరం, పాడేరు, విజయనగరం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాలు అరకు లోక్‌సభ పరిధిలోకి వస్తాయి.

అరకు స్థానం నుంచి మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, పాడేరు నుంచి గిద్ది ఈశ్వరిలకు దాదాపు ఖరారైనట్టే.

రంపచోడవరం నుంచి ఫణీశ్వరమ్మ, చిన్నంబాబు రమేశ్‌లు పోటీలో ఉండగా, సాలూరులో బంజ్‌దేవ్, స్వాతిరాణి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

పార్వతీపురంలో చిరంజీవులు, జయమణి, కురుపాం నుంచి జనార్ధన్ థాట్రాజ్, జానకీదేవి, పాలకొండలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు, నిమ్మక జయరాంలను టిక్కెట్లను ఆశిస్తున్నారు.

వీరితో చంద్రబాబు విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తెలుగుదేశం శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరోవైపు, ఈ సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ను వెల్లడించనుంది. కాగా, ఇబ్బందులు, అసంతృప్తులు లేనిచోట్ల 100 నుంచి 110 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆదివారమే ప్రకటిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *