దేశ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన సుష్మాస్వరాజ్‌ వర్దంతి … తాను రాజకీయ విలువలను పాటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.. అందుకే చిన్నమ్మగా గుర్తుంచుకోండి.. సుష్మా స్వరాజ్‌ యాదిలో

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ గారు పరమపదించి నేటికి సంవత్సరం గడించిది. రాజకీయ విలువలను పాటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకోవడమే కాకుండా దేశ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన సుష్మాస్వరాజ్‌ వర్దంతి నేడు.

ఈ సందర్భంలో తెలంగాణ చిన్నమ్మను తలుచుకుంటూ.. ఆమె గురించి మరోసారి..
సుష్మ స్వస్థలం ప్రస్తుత హరియాణాలోని అంబాలా. హరిదేవ్‌ శర్మ, లక్ష్మీదేవి దంపతులకు ఆమె 1952 ఫిబ్రవరి 14న జన్మించారు.

హరిదేవ్‌ ఆరెస్సెస్‌లో చాలా కీలకంగా పనిచేసేవారు. సుష్మ చదువుల్లో చురుకు. సంగీతం, లలిత కళలు, నాటకాలపై ఆసక్తి ఎక్కువ. సాహిత్యం, కవితలను విపరీతంగా చదివేవారు.

అంబాలాలోని ఎస్‌.డి.కళాశాలలో బీఏ చదివారు. ఆ సమయంలో ఎన్‌సీసీలో ఉత్తమ క్యాడెట్‌గా ఎంపికయ్యారు.

ఆ కళాశాలలో ఉత్తమ విద్యార్థి పురస్కారాన్నీ పొందారు. హరియాణా భాషా శాఖ నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడేళ్లపాటు అత్యుత్తమ హిందీ వక్త అవార్డు గెలుపొందారు.

చిన్నమ్మగా గుర్తుంచుకోండి….

2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఆమె వ్యవహరించడం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మారింది.

తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉండగా.. ఆమె మాట మార్చకుండా సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో బిల్లు ఆమోదం పొందింది.

ఉద్యమ సమయంలో సుష్మ.. పార్లమెంటు వెలుపలా, లోపలా తెలంగాణవాదానికి అండగా నిలిచారు.

తెలంగాణ సాకారంలో ఆ అమ్మ (సోనియా)నే కాదు.. ఈ చిన్నమ్మనూ గుర్తుంచుకోండి”..

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ ఎంపీలతో సుష్మాస్వరాజ్‌ అన్న మాటలివి.

ఢిల్లీలో జంతర్‌మంతర్‌, ఏపీ భవన్‌, ఇతర చోట్ల జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో జరిగిన ఉద్యమ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

2017 నవంబరు 28న హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశాంగ మంత్రి హోదాలో ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంలోనూ తాను తెలంగాణకు చిన్నమ్మనంటూ పునరుద్ఘాటించారు. రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని ఆమె సగర్వంగా నాడు ప్రకటించుకుంది.

వాగ్దాటిలో మేటి!

అనర్గళ స్వరం.. స్వచ్ఛమైన భారతీయత ఎటువంటి అదురు బెదరు లేకుండా సరళంగా స్పష్టంగా విషయాన్ని వెల్లడించడంలో ఆమెకు ఆమే సాటి. సాటిలేని వాగ్దాటి ఆగిపోయింది.

నిండైన కుంకుమ బొట్టుతో సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆ రూపం కనుమరుగైంది.

పదునైన విమర్శలతో రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే ఆ గళం ఇక వినిపించదు. ఆపన్నులు ఏ సమయంలో సహాయం కోరినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఆ అభయహస్తం వాలిపోయింది.

విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. పేదోడి దగ్గరి నుంచి పాలకుల వరకు అందరూ ఆమెను ప్రశంశించని వారు ఉండరూ అంటే ఆశ్చర్యం లేదు.

రాజకీయాల్లోకి..

విద్యార్థిగా ఉన్నప్పుడే 1970ల్లో సుష్మ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆపై జనతా పార్టీలో చేరారు.

అత్యయిక స్థితికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. 1977లో తొలిసారిగా హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అదే ఏడాది కేవలం 25 ఏళ్ల వయసులో రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అత్యంత పిన్న వయసులో కేబినెట్‌ మంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఆమే. 1987-90 మధ్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు.

27 ఏళ్ల వయసులో హరియాణా జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1990 ఏప్రిల్‌లో రాజ్యసభ ఎంపీగా సుష్మ బాధ్యతలు చేపట్టారు. 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా…

1998లో దిల్లీలోని హాజ్‌ ఖాస్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే ఏడాది అక్టోబరులో దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దిల్లీ సీఎం పీఠమెక్కిన తొలి మహిళ ఆమె రికార్డు సృష్టించారు.

లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు ఆమె చలువే!!

లోక్‌సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని అప్పట్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆమె 1996లో తీసుకున్నారు. ఆ సయమంలో వాజ్‌పేయీ ప్రభుత్వంలో ఆమె పనిచేశారు. 13 రోజులపాటు కొనసాగిన వాజిపేయి గవర్నమెంట్‌లో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉన్నారు.

ఇందిర తర్వాత….

2014 మే 26 నుంచి 2019 మే 30 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మహిళ సుష్మే.

అంతకు ముందు ఆమె రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే…. సుష్మ 2000 సెప్టెంబర్‌ 30 నుంచి 2003 జనవరి 29 మధ్య కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర ఆరోగ్యం – కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2009 జూన్‌ 3న లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ ఉప నేతగా బాధ్యతలు చేపట్టారు. ఆపై లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *