కరోనా వ్యాక్సిన్ సిద్ధం..?దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్..మోదీ మాటల్లో మర్మమిదేనా?

కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

దేశంలో పెద్ద ఎత్తున కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు.

భారత్‌లోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అందాలని మోదీ సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని.. మన దేశంతోపాటు విదేశాల్లో వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు.

ఈ సందర్భంగా నాలుగు సూచనలు చేశారు. ముందుగా కరోనా బారిన పడే ముప్పు అధికంగా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు.

ప్రపంచంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన మోడెర్నా లాంటి కొన్ని పరిశోధన సంస్థలు రూపొందించిన వ్యాక్సిన్లు ఆశాజనకమైన పనితీరు కనబరుస్తున్నాయి.

వీటిని మనుషులపై ప్రయోగిస్తున్నారు. తాజాగా మన దేశానికి, హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మన దేశంలో హ్యుమన్ ట్రయల్స్‌కు అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్ క్యాండిడేట్ భారత్ బయోటెక్‌దే కావడం విశేషం.

విదేశాలకు చెందిన సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను రూపొందిస్తే.. అవి మన దేశానికి చేరడానికి చాలా సమయం పడుతుంది.

ఒకవేళ ఇతర దేశ సంస్థలు వ్యాక్సిన్‌ను రూపొందించి.. ఇక్కడ ఉత్పత్తి చేసినా సరే..

మనతోపాటు వ్యాక్సిన్‌ను కనుగొన్న దేశానికి కూడా వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సి ఉంటుంది.

కానీ మోదీ మాత్రం.. దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని.. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా టీకాలు చేరాలని సూచించడం ఆసక్తికరంగా మారింది.

మోదీ వ్యాఖ్యలను బట్టి కచ్చితంగా వ్యాక్సిన్‌ భారత్‌‌లో తయారైంది లేదా ఉత్పత్తి అవుతుందనే భావన వ్యక్తం అవుతోంది.

విదేశాల్లో వ్యాక్సిన్‌ను కనుగొన్నప్పటికీ.. భారత్‌లో ఉత్పత్తి చేయాలంటే.. పుణే లేదా హైదరాబాద్ నగరాల్లోని సంస్థలే భారీ సంఖ్యలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలవు.

ఆక్స్‌ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ను తాము ఉత్పత్తి చేయనున్నట్లు పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ చివర్లోనే ప్రకటించింది.

ప్రపంచంలోనే భారీ మొత్తంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సంస్థగా దీనికి పేరుంది.

“ChAdOx1 nCoV-19”గా పిలుస్తోన్న ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగిస్తున్నారు.

ఈ ఏడాది 6 కోట్ల డోసులను ఉత్పత్తి చేయడంతోపాటు వచ్చే ఏడాదికి 40 కోట్ల డోసులను అందించాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ టార్గెట్‌గా పెట్టుకుంది.

వ్యాక్సిన్ ధరను సీరమ్ రూ.1000గా నిర్ణయించింది.

ఇకపోతే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి రూపొందించిన వ్యాక్సిన్‌ మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరిన స్వదేశీ వ్యాక్సిన్.

దేశంలోని అందరికీ వ్యాక్సిన్ చేరాలని.. సరసమైన ధరకే లభ్యం అయ్యేలా చూడాలని మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ స్పందనను బట్టి చూస్తే.. భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కొవాక్సిన్‌’పై భారీ అంచనాలే ఉన్నాయనే భావన వ్యక్తం అవుతోంది.

సీరమ్ తరహాలోనే భారత్ బయోటెక్ కూడా మనుషులపై ప్రయోగాలు చేపడుతుండగానే భారీ స్థాయిలో వ్యాక్సిన్లను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేస్తుందేమో అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మరి కొద్ది రోజులు ఆగితే ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *