నేడు తిరుపతికి రాహుల్… మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం కాలినడకన స్వామి దర్శనానికి

Rahul Gandhi Biography

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నా ఇప్పట్లో అది సాధ్యమయ్యేది కాదు.

విభజన తర్వాత కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు అంత తేలిగ్గా ఆ బాధను మరచిపోరు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కొడిగట్టిన దీపంలా తయారైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో డిపాజిట్లు గల్లంతయ్యాయి.

అయితే, తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ మాటమార్చడంతో తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని కాంగ్రెస్ అంటోంది.

ఇందు కోసం ఏపీకి ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్రను రెండు రోజుల కిందట ఆ పార్టీ ప్రారంభించింది.

ఈ యాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకోవడంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇక్కడ నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల్లో తిరుపతి తారకరామ మైదానం వేదికగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హామీలిచ్చిన విషయం తెలిసిందే. అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బహిరంగ సభను నిర్వహిస్తోంది.

హోదాపై మోదీ యూటర్న్ తీసుకున్న వైనాన్ని రాహుల్‌ ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ వైఖరిని వెల్లడించనున్నారని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంటకు రాహుల్‌గాంధీ చేరుకుంటారు.

అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని, మధ్యాహ్నం 3 గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి తిరుపతికి చేరుకుని, సాయంత్రం 4.30 గంటలకు బాలాజీకాలనీ కూడలిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తారు.

అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి భరోసా యాత్ర బస్సులో తారకరామ మైదానానికి చేరుకుంటారు.
సాయంత్రం 5 గంటలకు సభలో ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *