జగన్‌ని సీఎం చేయాలన్న ఆకాంక్షతోనే వైసీపీలో చేరానని చెప్పారు : సినీ కమెడియన్ అలీ…

జగన్‌ని సీఎం చేయాలన్న ఆకాంక్షతోనే వైసీపీలో చేరానని చెప్పారు సినీ కమెడియన్ అలీ. జగన్ కమిట్‌మెంట్ కలిగిన నేతని, మాటిచ్చారంటే తప్పరని అన్నారు.

ఈరోజు ఉదయం లోటస్‌ పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసిన అలీ.. వైసీపీలో చేరారు. జగన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అలీ.. వైఎస్ కుటుంబంతో తన అనుబంధం ఇప్పటిది కాదన్నారు.

2004లో వైఎస్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన్ని కలిసి తప్పకుండా సీఎం అవుతారని చెప్పానని.. అనుకున్నట్లుగా వైఎస్ సీఎం అయ్యారని తెలిపారు.

అలాగే సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అలీ అన్నారు.

ప్రజల కోరిక మేరకు ఆయన్ని సీఎం చేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరానన్నారు.

ఈ ఎన్నికల్లో తనకు టిక్కెట్ కేటాయించలేనని జగన్ చెప్పారని, పార్టీ తరపున ప్రచారం చేయాలని ఆదేశించారని తెలిపారు.

పాదయాత్ర సమయంలో చాలామందికి కమిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తనకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా స్థానికంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ తనకు వివరించినట్లు అలీ చెప్పారు.

జగన్ ఆదేశాల మేరకు వైసీపీ తరపున రాష్ట్రమంతా ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

ఒకవేళ జగన్ రాజమండ్రి, విజయవాడలో ఎక్కడి నుంచి టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని అలీ చెప్పారు.

గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, కొత్త ఏడాది సందర్భంగా విషెస్ చెప్పేందుకే వారిని కలిశానన్నారు.

టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ టిక్కెట్ ఆశించిన మాట వాస్తవమేనని, అయితే అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న కొందరు నేతలు వ్యతిరేకించడంతో తనకు అవకాశం దక్కలేదని అలీ చెప్పారు.

పవన్ తనకు స్నేహితుడని, అయితే రాజకీయాలు, స్నేహాన్ని ముడిపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందన్నది ప్రజలే నిర్ణయిస్తారని అలీ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *