చలో ట్రైన్ -18 లో… టికెట్ ధర తగ్గింపు…వందే భారత్‌…

భారత్‌లో తయారీ’ కింద నిర్మించిన తొలి ఇంజిన్‌ రహిత సెమీ-హైస్పీడ్ రైలు ‘వందే భారత్‌’(ట్రైన్‌-18) టికెట్‌ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దిల్లీ-వారణాసి మధ్య తిరిగే ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

మరో రెండు రోజుల్లో ఈ రైలు పట్టాలు ఎక్కబోతుంది . దిల్లీ నుంచి వారణాసికి ఏసీ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1,850గా ఉండగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ.3,520 చొప్పున ఉంటాయని నిన్న అధికారులు తెలిపారు.

అయితే.. ఇప్పుడు ఈ ధరలను తగ్గించినట్లు మరో ప్రకటనను కూడా విడుదల చేశారు.

ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ.3,520 నుంచి రూ.3,310కి తగ్గించగా, చైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1,850 నుంచి రూ.1,760కి తగ్గించినట్లు తెలిపారు.

తిరుగు ప్రయాణంలో ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1,700కాగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ.3,260గా ఉండనుంది. అల్పహార, భోజన వసతితో కలిపి ఈ ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో ఈ రైలును తీసుకురానున్నారు. 16 బోగీలు ఉండే ఈ రైలు గంటకు రూ.180కి.మీ వేగంతో ప్రయాణించనుంది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఫస్ట్‌క్లాస్‌ ఏసీ బోగీ ఛార్జీలతో పోల్చితే ట్రైన్‌ 18 ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర 1.4రెట్లు, ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ ధర 1.3రెట్లు అధికం.

ఈ రెండు క్లాసులు మాత్రమే ట్రైన్‌-18లో ఉంటాయి. పిబ్రవరి 15 ఉదయం 10 గంటలకు దిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు.

మరి ఈ పట్టాలు మనము ఎక్కడానికి వేచి ఉండవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *