డేటా దొంగతనం కేసులో పావులు కదుపుతున్న చంద్రబాబు నాయుడు

నలభయ్యేళ్ళ రాజకీయం చంద్రబాబుకి చాలా నేర్పింది. ఎంత పెద్ద సమస్య నుంచైనా చంద్రబాబు తెలివిగా తప్పించుకోగలరు. చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్థులైనాసరే, ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే.

లేకపోతే, ‘బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబుని కాపాడలేడు’ అంటూ తొడగొట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆ తర్వాత ఎందుకు ఓటుకు నోటు కేసు విషయమై చేతులెత్తేసినట్లు.?

ఇప్పుడు మళ్ళీ అలాంటి చాణక్యాన్ని ప్రదర్శించే సమయమొచ్చింది చంద్రబాబుకి. ‘డేటా దొంగతనం’ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తోన్న విషయం విదితమే.

ఈ కుదుపు తెలంగాణలో అతి తక్కువగా, ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తీవ్రంగా కన్పిస్తోంది. తెలంగాణ పోలీసులు, ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

‘ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అంటూ కేసు విచారిస్తోన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మీడియా సాక్షిగా చేసిన హెచ్చరికలు ఎవర్ని ఉద్దేశించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నిజానికి, ఇలాంటి హెచ్చరికలు గడచిన నాలుగున్నరేళ్ళలో తెలంగాణలో ఆయా కేసుల విషయంలో పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు చాలా సందర్భాల్లో చేశారు.

అదీ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీపై. ఆ కేసులు ఏమయ్యాయి.? అని అడక్కూడదంతే. ఇక, చంద్రబాబు తెలివిగా ‘డేటా దొంగతనం’ కేసులో పావులు కదుపుతున్నారు.

ప్రభుత్వం తరఫున ఒక్కో విషయమ్మీదా అధికారులతో క్లారిటీ ఇప్పించేస్తున్నారు. అసలు డేటా దొంగతనానికి ఆస్కారమే లేదంటూ చంద్రబాబు, అధికారులతో చెప్పించిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఇప్పుడే ఏముంది? అసలు కథ ముందుంది! అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నేతలు. దానర్థమేంటి.? అన్ని శాఖల అధికారులతో ‘క్లియరెన్స్‌’ తెప్పించేసుకుని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల్ని తెలంగాణ
పోలీసులపైకి చంద్రబాబు.

ప్రయోగించబోతున్నారా.? అయితే, దానికి సమయం చాలా తక్కువగా వుంది. ఎందుకంటే, త్వరలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేయనుంది. అందుకే, చంద్రబాబు కూడా తొందరపడుతున్నారట.

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పోలీస్‌ అధికారులపై చట్టపరమైన చర్యల గురించి ఆలోచిస్తున్నాం..’ అంటూ క్యాబినెట్‌ భేటీ తర్వాత ఓ మంత్రిగారు సెలవిచ్చారంటే, పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతానికైతే దొరికిన డేటాను విశ్లేషిస్తున్న తెలంగాణ పోలీసులు, ఆ డేటా ఆధారంగా ఎంత తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చు.

అన్నదానిపై సమాలోచనల్లో వున్నారట. చంద్రబాబు అండ్‌ టీమ్‌, వాటిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమవుతోంది. ఏమిటో, ఈ రాజకీయ వైపరీత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *