చంద్రబాబు నాయుడితోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందని: బెంగాల్ సీఎం మమతా…

బాబు వస్తేనే ఏపీ అభివృద్ధి, బీజేపీని అడ్డుకునేది మేమే: మమత
చంద్రబాబు నాయుడితోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆయన మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ దోపిడీ దారులకే కాపలాదారనీ.. ప్రజల కాదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీని సాగనంపితేనే దేశానికి భద్రత అని చెప్పారు.

సీఎం చంద్రబాబు నాయుడితోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. ఆయన మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆదివారం (మార్చి 31) రాత్రి విశాఖపట్నం మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో మమత ప్రసంగించారు. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు.

మోదీ అన్ని రాష్ట్రాల నేతలనూ భయపెడుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. గత ఎన్నికల్లో చాయ్‌వాలా అన్నారని.. ఇప్పుడు చౌకీదార్‌ అంటున్నారని విమర్శించారు.

ఆయన దోపిడీ దారులకే కాపాలదారని మండిపడ్డారు. ఇప్పటివరకు మీడియా సమావేశం కూడా పెట్టని ప్రధాని మోదీయేనని విమర్శించారు. నిత్యం అబద్ధాలు చెబుతూ బతికేస్తున్నారని ధ్వజమెత్తారు.

దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోదీ నిర్వీర్వం చేస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘పుల్వామా ఘటన తర్వాత అఖిపక్షం నిర్వహించారా? నోట్ల రద్దువల్ల ఉగ్రవాదం సమసిపోతుందని చెప్పి ఏం చేశారు? మోదీ వల్ల దేశం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోం..

బీజేపీని అడ్డుకునేది మేమే. మోదీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. ఎవరు ప్రధాని అవ్వాలో ఎన్నికలు అయ్యాక నిర్ణయించుకుంటాం’ అని మమత చెప్పారు.

మోదీ పాలనలో సైనికులు, రైతులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని మమత మండిపడ్డారు. ‘56 అంగుళాల ఛాతీ అంటారు.. 560 అబద్ధాలు చెప్పారు.

బెంగాల్‌, ఒడిశాలో అనేక పనులు చేశామని అబద్ధాలు చెప్పారు. యూపీలో ఈసారి బీజేపీకి 10 సీట్లు కూడా రావు. బీజేపీకి125 లోక్‌సభ సీట్లు దాటితే అదే గొప్పే’ అని మమత అన్నారు.

ఈసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చేది నిజమైన ప్రజా ప్రభుత్వమని మమత చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజలకు స్వేచ్ఛ ఉండదన్నారు.

బీజేపీని అధికారంలోకి రానివ్వమని ధీమా వ్యక్తం చేశారు. జవాన్లు అంటే మోదీకే కాదు.. తమకూ అభిమానం ఉందన్నారు. మోదీ హఠావో అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు.

ఈ బహిరంగ సభలో మమత బెనర్జీతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొని ప్రసంగించారు. మోదీపై ఘాటు విమర్శలు చేసిన దీదీ.. ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *