జగన్ గృహప్రవేశంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ పేదల పార్టీ కాదని, ప్యాలెస్‌ల పార్టీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి ఉదయం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్యాలెస్‌లు లేకపోతే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాసం ఉండలేడు గతంలో హైదరాబాద్, బెంగళూరులో.. ఇప్పుడు తాడేపల్లిలో మరో ప్యాలెస్, ప్రధాని మోదీ సభలకు జనాన్ని తరలిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు.

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లిలో నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.

వైసీపీ పేదల పార్టీ కానే కాదని, అది ప్యాలెస్‌ల పార్టీ అని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా రాజ ప్రసాదాల్లోనే ప్రతిపక్ష నేత బస చేస్తారని ఎద్దేవా చేశారు.

గతంలో హైదరాబాద్‌లో లోటస్ పాండ్, బెంగళూరులో ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్‌లు చాలవన్నట్లుగా ఇప్పుడు అమరావతిలో జగన్ మరో ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు.

టీడీపీ నేతలతో బుధవారం ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ జగన్‌‌కు ప్యాలెస్‌ల మీద ఉన్న ప్రేమ ప్రజాసేవ పట్ల లేదని విమర్శించారు. ప్యాలెస్‌ల నిర్మాణం పూర్తయితే తప్ప ఇళ్లు మారని వ్యక్తి జగన్ అని విమర్శించారు.

రాజధాని విషయంపై ప్రతిపక్షనేత, వైసీపీ నేతలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారని, అందులో భాగంగానే వారి మేనిఫెస్టోలో రాజధాని ఎక్కడ అనే అంశాన్ని పెట్టారని మండిపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ సభలకు వైసీపీ జనాన్ని తరలిస్తోందని ఆరోపించారు.

మోదీ గుంటూరు సభకు జనాన్ని తరలించిన వైసీపీ నేతలు విశాఖలో జరగనున్న సభకు సైతం జనాన్ని పోగేసి తమ బుద్ధి చూపించిందన్నారు.

కాగా, గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటిలోకి బుధవారం ఉదయం (ఫిబ్రవరి 27న) గృహప్రవేశం చేశారు.

సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు కొత్తింట్లోకి అడుగుపెట్టారు.

ఈ కార్యక్రమానికి జగన్ తల్లి వైఎస్‌ విజయలక్ష్మీ, సోదరి షర్మిల, అనిల్‌ దంపతులు, వైసీపీ కీలకనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *