ఇద్దరిది ఉప్పు.. నిప్పు వైనం….అస్సలు పడదు (దాడివీరభద్రరావు v/s కొణతాల రామకృష్ణ)*

మనం కోరుకునేది ఒకటి. మనకు దక్కేది ఇంకొకటి అంటే ఇలాగే వుంటుందేమో? అనకాపల్లిలో ఇప్పుడు అచ్చం ఇలాంటి రాజకీయమే నడుస్తోంది.

చిరకాలం తెలుగుదేశంతో వుండి, ప్రస్తుతం ఎటూ వుండకుండా వున్నారు మాజీమంత్రి దాడివీరభద్రరావు. చిరకాలం కాంగ్రెస్ లో వున్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణదీ ఇదే పరిస్థితి.పైగా ఇద్దరిది ఉప్పు.. నిప్పు వైనం. అస్సలు పడదు.

ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి. ఇద్దరికీ ఎవరి గూట్లోకి వాళ్లు వెళ్లాలని కోరిక. వైకాపాలోకి వెళ్లాలని రామకృష్ణకు, తేదేపాలోకి వెళ్లాలని వీరభద్రరావుకు. కానీ రెండుచోట్లా ఇద్దరికీ సమస్యే.

తేదేపాలోకి వస్తే రావచ్చు కానీ సీటు ఇవ్వమని తెలుగుదేశం పార్టీ వీరభద్రరావుకు క్లియర్ చేసేసింది.

అనకాపల్లి రాజకీయం – బహుచిత్రమ్

కొణతాలను పార్టీలోకి రానివ్వడానికి పార్టీ కీలక వ్యక్తులు అంతా సై అన్నా, జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు.

దాంతో ఆయనకు అక్కడ సమస్య వచ్చింది. దాంతో ఇద్దరూ ఇష్టం వున్నా లేకున్నా, అట్నుంచి, ఇటు ఇట్నుంచి అటు వెళ్లకతప్పడం లేదు.

వీరభద్రరావుకు అనకాపల్లి టికెట్ ఇస్తామని, కానీ కొడుకు రత్నాకర్ కు కావాలంటే మాత్రం నో అని వైకాపా స్పష్టం చేసేసింది.

అలాగే కొణతాలకు ఎంపీ టికెట్ ఇస్తామని, ఎమ్మెల్యేగా కాదని తేదేపా చెప్పేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కొణతాల వెళ్లి చంద్రబాబును కలిసారు.

ఇదిలావుంటే సందట్లో సడేమియా అన్నట్లుగా మంత్రి గంటా శ్రీనివాసరావు భార్యవైపు బంధువు పరుచూరి భాస్కరరావు అనకాపల్లి నుంచి కాంగ్రెస్ తరపున నిల్చోవడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఇప్పటి నుంచే పరుచూరిని స్థానికేతరుడిగా (ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, విశాఖకు వ్యాపారాల నిమిత్తం వచ్చారు) చిత్రీకరించే పనికి దాడి వీరభద్రరావు అప్పుడే శ్రీకారం చుట్టారు.

జనసేన నుంచి కూడా బరిలోకి దిగాలని కొందరు అనుకుంటున్నారు కానీ, పెద్దగా లెక్కలోకి లేదు వ్యవహారం.

నిజానికి ఇద్దరు గవర కులస్థులు పోటీపడుతుంటే, కాపులు అధికంగా వున్నచోట సరైన కాపు అభ్యర్థి జనసేన నుంచి వుంటే పోటీ రంజుగా వుంటుంది.

కానీ ఆ పరిస్థితి వస్తుందా అన్నది అనుమానం. మరోపక్క భాజాపాకు కూడా అనకాపల్లిలో సంస్థాగతంగా స్థిరమైన ఓట్ బ్యాంక్ చిన్నదో పెద్దదో వుంది.

అందువల్ల ఈ సారి అనకాపల్లిలో బలమైన బహుముఖ పోటీ వుండేలాగే వుంది వ్యవహారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed