బ్లాక్ మెయిల్ …. ఏపీలో పోస్ట్ డేటెడ్ చెక్కులపై ఈసీ ఆరా

ఎన్నికల ముందు ప్రలోభ పెట్టడానికి కొంత మొత్తం… ఇవే ఎన్నికల్లో ఓటు తమకు వేయాల్సిందే అని బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి.. పోస్ట్ డేటెడ్ చెక్.. ఇదీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వ ఘన కార్యం.
గతంలో అధికారంలో ఉండిన ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి చేష్టలకు పాల్పడలేదు. అయితే దేనికీ భయపడనట్టుగా తయారైన చంద్రబాబు ప్రభుత్వం ఆఖరికి పోస్ట్ డేటెడ్ చెక్కులనూ తెచ్చింది.
ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు అని ప్రకటించారు.
అయితే ఈ పది వేలలో ప్రస్తుతానికి ఓటు ధర అన్నట్టుగా రెండు వేల రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు కొనే ప్రక్రియ ఇది.
ఇక మిగతా ఎనిమిది వేల రూపాయలకూ పోస్టు డేటెడ్ చెక్కులు ఇస్తున్నారు. తమకు మళ్లీ అధికారం ఇస్తే.. దశలవారీగా ఆ డబ్బులు ఇస్తామనే షరతు పెడుతున్నారు. ఒట్లు వేయించుకుంటున్నారు, ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేయించుకుంటున్నారు.
కేవలం డ్వాక్రా మహిళలకే కాదు.. రైతులకూ పోస్టు డేటెడ్ చెక్కులు ఇచ్చే పక్రియ ఒకటి రాబోతోంది.
గత ఎన్నికల ముందు ఇచ్చిన రైతు రుణమాఫీకి ఈ ఎన్నికల ముందు పోస్టు డేటెడ్ చెక్కులు ఇస్తారట.
అంటే మళ్లీ అధికారం దక్కితే నాలుగు, ఐదో విడుతల మాఫీ ఫలం అందుతుంది లేకపోతే లేదు అని బ్లాక్ మెయిల్ చేయడమే ఇది.
ఎన్నికల్లో నెగ్గడానికి ఆఖరికి ఇలాంటి ఎత్తుగడలను అమల్లో పెడుతున్నారు.
చంద్రబాబు మాజాకా. దీనిపై పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వ్యవహారం గురించి వివరణ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతకు తెగించిన వారికి.. ఈసీని తప్పుదోవ పట్టించడం పెద్ద కథ కాదేమో!