అన్నింటికీ సిద్ధంగా ఉండండి: పాక్‌ ప్రధాని

భారత్‌ చేపట్టిన మెరుపుదాడులను పాకిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది. మెరుపుదాడుల గురించి పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌సీ)తో అత్యవసర సమావేశమయ్యారు.

అనంతరం ఎన్‌ఎస్‌సీ దాడులను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌ దాడులపై తాము సమయం, సందర్భం చూసుకొని సరైన సమాధానమిస్తామని ప్రకటనలో పేర్కొంది.

‘బాలాకోట్‌ సమీపంలో ఉగ్రవాద స్థావరాలంటూ భారత్‌ చేసిన దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోసారి భారత్‌ కల్పిత కథలు చెబుతూ నిర్ల్యక్షంగా వ్యవహరించింది. ఆదేశ ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్‌ ఈ విధమైన చర్యకు దిగింది.

భారత్‌ బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనను ప్రపంచ నేతల ఎదుట బహిర్గతం చెయ్యాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయించుకున్నారు’ అని ఎన్‌ఎస్‌సీ తన ప్రకటనలో పేర్కొంది.

పాక్‌ త్వరలో తీసుకోబోయే అన్ని చర్యలకు సైన్యం, దేశ ప్రజలు సంసిద్ధంగా ఉండాలని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సూచించినట్లు ఎన్‌ఎస్‌సీ తెలిపింది.

సమావేశం అనంతరం ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ కూడా ఇదే విషయాన్ని ట్వీట్‌ చేసింది. పాక్‌ ఎన్‌సీఏతో ప్రధాని రేపు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పీటీఐ తెలిపింది.

భారత్‌ కాల్పుల ఉల్లంఘన విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాలని పాక్‌ భావిస్తుంది. భారత్‌ దాడి చేసిన ప్రదేశాన్ని వచ్చి చూసి నిజానిజాలేమిటో తెలుసుకోవాల్సిందిగా పాక్‌ అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *