సీఎం జగన్‌కు …రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

AP Capital: సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ సంస్థ.. రాజధాని విషయమై డిసెంబర్ 21నే మధ్యంతర నివేదిక అందజేసింది.

ఏపీ రాజధానిపై అధ్యయనం నిర్వహించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఏపీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది.

శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ రిపోర్టును అందజేశారు. డిసెంబర్ 21న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను అందజేసింది.

కొత్తగా రాజధానిని నిర్మించడం కంటే.. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరంలో రాజధానిని ఏర్పాటు చేయడం ఉత్తమం అని, తద్వారా సత్వర పురోగతి సాధ్యం అవుతుందని మధ్యంతర నివేదికలో పేర్కొంది.

దీంతో జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగానే బీసీజీ రిపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు.

జీఎన్ రావు కమిటీ డిసెంబర్ 21న పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో పరిపాలనను వికేంద్రీకరించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.

రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతీయ మండళ్లుగా విభజించాలని సూచించింది. రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య సమతుల్యత పాటించాలని సిఫారసు చేసింది.

పది మంది మంత్రులు, ఆరుగురు అధికారులతో కూడిన హైపవర్ కమిటీని జగన్ సర్కారు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 6న హైపర్ కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీ జనవరి 20న సీఎంకు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మూడు కమిటీల రిపోర్టుల ఆధారంగా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజధానిని మార్చొద్దని ఆందోళనలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో.. అమరావతి ప్రాంత పురోగతి కోసం ఏమేం చేయాలనే దిశగా జగన్ సర్కారు ఆలోచిస్తోందని సమాచారం.

అమరావతి ప్రాంతాన్ని స్పెషల్ అగ్రి జోన్‌గా, ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేయాలని భావిస్తోందనే వార్తలు వెలువడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed