బాబుకు దూరమవుతున్న టాలీవుడ్

అవసరార్థం పాదసేవ అన్నది నానుడి. అవసరం వుంటేనే ఎవరన్నా దగ్గరకు చేరతారు. లేదంటే లేదు. ఇప్పుడు టాలీవుడ్ జనాల పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
టాలీవుడ్ కీలక వ్యవహారాలు అన్నీ హైదరాబాద్ లోనే వున్నాయి.
అందుకే రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి టాలీవుడ్ కేసిఆర్ కు దగ్గర కావడం, బాబుకు దూరంకావడం ప్రారంభమైంది.
సినిమా జనాలతో కేటిఆర్ టచ్ లో వుండడం, సినిమా రంగానికి బాగా దగ్గరగా వుండే తలసాని శ్రీనివాస యాదవ్ ను సినిమాటోగ్రఫీ మంత్రిగా చేయడంతో గత అయిదేళ్లలో టాలీవుడ్ దాదాపు బాబును మరిచిపోయింది.
హీరో కృష్ణ ఫ్యామిలీ కేసిఆర్ కు దగ్గరయ్యారు. అల్లు అరవింద్ లేదా చిరంజీవి మెగా క్యాంప్ కాంగ్రెస్ తో వుండి ఇప్పుడు జనసేనకు దగ్గరయింది.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి నేరుగా జగన్ తో దగ్గరి బంధుత్వమే వుంది. దివంగత దర్శకుడు దాసరి తనయుడు వైకాపాకు దగ్గరవుతున్నారని వార్తలు వున్నాయి.
హీరో నాగార్జున నేరుగా వెళ్లి జగన్ ను కలిసి పాదయాత్రపై అభినందించి వచ్చారు. ప్రమఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే వైకాపా ఎమ్మెల్యేతో బంధుత్వం కలుపుకున్నారు.
హీరో నిఖిల్ మామయ్య వైకాపా తరపున పోటీలోకి దిగబోతున్నారు. పృథ్వీ, పోసాని వైకాపా తరపున గట్టిగా గొంతు వినిపిస్తున్నారు.
బాబు చేసింది లేదు. ఇదిలా వుంటే అయిదేళ్లలో బాబు టాలీవుడ్ కు చేసిదంటూ ఏమీలేదనే చెప్పాలి.
టాలీవుడ్ ను ఆంధ్రలో కూడా అభివృద్ధి చేస్తామని అనడమే కానీ, అటు అమరావతిలో కానీ, ఇటు విశాఖలో కానీ లేదా తిరుపతి ప్రాంతంలో కానీ, అందుకోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
అమరావతిలో ఎన్నో సంస్థలకు, వ్యక్తులకు వేల ఎకరాలు ధారాదత్తం చేసారు కానీ, టాలీవుడ్ స్టూడియోలకో, ఇతర సంస్థలకో ఏమీ ఇవ్వలేదు.
అలా అని దరఖాస్తులు చేయలేదా అంటే చాలామంది ప్రయత్నాలు చేసారన్న టాక్ వుంది.
కేవలం థియేటర్ల టికెట్ ల పెంపు, పన్నుల వ్యవహారాలు చూసీ చూడనట్లు వదిలేయడం మినహా బాబు చేసింది లేదని విమర్శ వుంది.
అలాగే ఆంధ్రలో షూటింగ్ లకు సబ్సిడీలు ఇవ్వడంలో విధించిన నిబంధనల కారణంగా పెద్దగా ఉపయోగం లేదనీ టాక్ వుంది.
ఇలా మొత్తంమీద టాలీవుడ్ వ్యవహారం చూస్తుంటే బాబుకు దూరం అవుతున్నట్లే వుంది. ప్రస్తుతానికి. ఎందుకంటే ఎక్కడ అధికారం వుంటే అక్కడ వాలడం అన్నది టాలీవుడ్ కు అలవాటు.
బాబుతో, తరువాత వైఎస్ తో, ఆపై బాబుతో ఇలా అటు ఇటు షిఫ్ట్ అయిన నేపథ్యం టాలీవుడ్ కు వుంది.