అర్ధరాత్రి లాఠీ ఛార్జీ: వైఎస్ఆర్ సీపీ, జనసేన పార్టీ ప్రతినిధుల అరెస్ట్..పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన

గుంటూరులో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. అరండళ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామినీని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారనే ఆరోపణలపై గుంటూరు అరండళ్ పేట పోలీసులు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

వారిలో ఏడుమంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, మిగిలిన ముగ్గురు జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అరెస్టయిన వారంతా ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు.

వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని ఐటీ విభాగంలో పని చేస్తున్న షేక్‌ ఖాలీషా వలిని ఆదివారం ఉదయం అరెస్టు చేశారు.

ఆయనను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందురులో అదుపులోకి తీసుకుని గుంటూరుకు తీసుకెళ్లారు.

దేవదాసు (భాగ్యనగర్), పసుపులేటి శ్యామల (కడప), కె.వి.క్రిస్టల్ (చిత్తూరు), గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలపాడుకు చెందిన గుదిబండి గోపి శ్రీవాత్సవరెడ్డి, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురానికి చెందిన పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్‌ మండలానికి చెందిన కల్లూరుపాలేనికి పీ నరేష్‌ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

జనసేన పార్టీకి చెందిన మంగళగిరి మండలం యర్రబాలేనికి చెందిన లేళ్ల సాయినందన్‌, నెల్లూరుకు చెందిన జవ్వాది సాయి, పశ్చిమగోదావరి బీమడోలుకు చెందిన వి శ్రీహరి అదుపులోకి తీసుకున్నారు.

వారందర్నీ రాత్రికి అరండళ్ పేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యామినీశర్మకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిడం వల్లే వారిని అదుపులోకి తీసుకున్నామని అరండళ్ పేట సిఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐ ప్రేమయ్య తెలిపారు.

వారిని విచారించిన అనంతరం వదిలి పెడతామని అన్నారు.

ఈ సమాచారం తెలిసిన వెంటనే అరెస్టయిన వారి తల్లిదండ్రులు, రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అరండళ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్నారు.

ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు మీదే బైఠాయించారు.

దీనితో సంఘటనాస్థలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి వరకూ వారి ఆందోళన కొనసాగింది.

తమవారిని వెంటనే విడుదల చేయాలని ప్రదర్శనకారులు పట్టుబట్టారు.

అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారులో అరండళ్ పేట మీదుగా వెళ్తుండటాన్ని చూసిన ఆందోళనకారులు అప్రమత్తమయ్యారు.

కారును అడ్డగించారు. కారు ముందు బైఠాయించారు. ఎమ్మెల్యేకు నిరసనగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నారు.

ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేశారు. వారిని చెదరగొట్టారు. ఆలాపాటి వెళ్లిన తరువాత తమ ఆందోళనను మళ్లీ కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *