ఆర్మీ వార్నింగ్ .. కశ్మీర్‌లో తుపాకి పడితే కాల్చిపారేస్తాం

పుల్వామా ఆత్మాహుతి దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి.

లోయలో తుపాకి పడితే కాల్చిపారేస్తామని ఇండియన్ ఆర్మీ హెచ్చరికలు.
ఉగ్రవాదం పేరుతో దేశంలోకి చొరబడితే ప్రాణాలతో తిరిగి వెళ్లరని వార్నింగ్.కశ్మీరీ యువత ఉగ్రవాదంలో చేరితే వారి తల్లులు వెనక్కు రప్పించాలని సూచన.

కశ్మీర్‌ లోయలో ఎవరైనా తుపాకి పడితే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆర్మీ హెచ్చరించింది.

ఆర్మీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పై విధంగా స్పందించారు.

స్థానిక ఉగ్రవాదుల తల్లులకు తాను ఒక్కటే మనవి చేస్తున్నానని, తమ పిల్లలు ఆయుధాలు వీడి లొంగిపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ‘కశ్మీర్ సమాజంలో అమ్మలు కీలక పాత్ర పోషిస్తారు..

ఎవరైతే ఉగ్రవాదంలో చేరారో వారి తల్లులు తమ కుమారులను దయచేసి వెనక్కు రప్పించి, జనజీవన స్రవంతిలో చేరడానికి సహకరించాలని ప్రాధేయపడుతున్నానని’ అని పేర్కొన్నారు. లొంగిపోకుండా ఎవరైనా తుపాకులు, ఆయుధాలు పట్టుకుంటే వారిని మట్టుబెడతామని ధిల్లాన్ హెచ్చరించారు.

గతవారం జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించిందని, ఇందులో ఆ దేశ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం కూడా ఉందని ఆర్మీ కమాండర్ ఉద్ఘాటించారు.

ప్రస్తుతం తమ దృష్టింతా ఉగ్రవాద కార్యకలాపాలపై ఉందని, ఎవరైనా కశ్మీర్ లోయలోకి చొరబడితే ప్రాణాలతో తిరిగి వెళ్లబోరని పునరుద్ఘాటించారు.

పుల్వామా సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి తర్వాత కీలక ఉగ్రవాదులను హతమార్చామని, వీరంతా ఐఎస్ఐ, పాకిస్థాన్, జేషే మహ్మద్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని అన్నారు.

కశ్మీర్‌ లోయలోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అగ్ర నేతలే సైన్యం తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు.

అందులో భాగంగా పుల్వామా ఘటన జరిగిన 100 గంటల్లోనే ఆ సంస్థకు చెందిన కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టామని అన్నారు.

సోమవారం పింగ్‌లాన్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో పుల్వామా సూత్రధారి అబ్దుల్ రషీద్ ఘాజీతో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం ప్రస్తావించారు.

కశ్మీర్‌లో చాలా కాలం తర్వాత ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని, ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉంటామని ధిల్లాన్ వెల్లడించారు.

సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయంతో సెలవులో ఉన్న బ్రిగేడియర్ హర్‌దీప్ సింగ్ తనకు తానుగా వచ్చి పాల్గొన్నారని, గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఈ ఆపరేషన్‌ను ముందుండి నడిపించారని ధిల్లాన్ ప్రశంసలు కురిపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *