రాజకీయ రణరంగంలో ఏపీ పాలిటిక్స్ హంగామా…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఎన్నో విచిత్రాలు.

ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది.

ఒకే పార్టీని దశాబ్ధాల తరబడి నెత్తిన పెట్టుకున్నా, కొత్తగా వచ్చిన పార్టీకి తొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండమైన విజయంతో అధికారాన్ని అప్పగించినా, ఆ తర్వాత ఆ పార్టీని కూడా చిత్తుగా ఓడించినా.. అప్పటికే విసిగించిన పార్టీని మళ్లీ నెత్తిన పెట్టుకున్నా.. వెన్నుపోటు దారుడనే ముద్ర ఉన్న వ్యక్తికే మరో సారి అధికారాన్ని అప్పగించినా, ఆరోపణలను పక్కనపెట్టి.. వరసగా మళ్లీ వైఎస్‌కు మరోసారి ముఖ్యమంత్రి పదవినే ఇచ్చినా.. ఇలా ఎన్నో విచిత్రాలు ఉన్నాయి…

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ను దారుణంగా దెబ్బకొట్టారు తెలుగు ప్రజలు.

విభజిత ఏపీ.. . విభజనతో నష్టపోయిన సీమాంధ్రలో అయితే.. కాంగ్రెస్‌పార్టీ నిర్వీర్యం అయిపోయింది. తెలంగాణలో కోలుకోలేకపోతోంది.

ఇక విభజన తర్వాత ఏపీలో అనేక సమీకరణాల మధ్యన చంద్రబాబు నాయుడు చేతికి అధికారం దక్కింది.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? ఏపీ ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారు.. అనే అంశాలు హల్ చల్ చేస్తున్నాయి.

ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు.. ఏపీ ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నాయి. దాదాపుగా ఎవరికి వారుగా పోటీచేస్తున్నట్టే.

తాము ఒంటరిగా పోటీచేస్తామని, ఎవ్వరితోనూ పొత్తు ఉండదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్‌పార్టీ కూడా సొంతంగా పోటీచేస్తున్నట్టుగా ప్రకటించింది.

బీజేపీ కూడా దాదాపుగా సొంతంగా పోటీలో ఉన్నట్టే. అయితే అధికార తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తోందని అంటున్నారు.

జనసేనతో పొత్తుకోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఇక పవన్‌కల్యాణ్‌ ఏమో కమ్యూనిస్టు పార్టీలతో మాత్రమే పొత్తు అని అంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన-కమ్యూనిస్టులు.. ఈ ఐదు కూటముల మధ్యన పోటీఉన్నట్టే. అయితే  కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం… కూరలో కరివేపాకు గా భావించవచ్చు.

ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణం… కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా గెలుపుమాట అటుంచి, ఫలితాలను ప్రభావం చూపేంత స్థాయి ఓటు బ్యాంకును అయినా కాంగ్రెస్‌ పార్టీ చీల్చగలదా? అనేది ప్రశ్నార్థకం.

ఇక జనసేన అండర్‌ డాగ్‌ మాత్రమే. కమ్యూనిస్టులతో కలుపుకుని ఆ పార్టీ ఓట్లను చీల్చి ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తుంది, ఆ ప్రభావం అయినా ఉంటుందా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ చెప్పలేం. ప్రస్తుత పరిస్థితి ఇది.

మరిగతం ఏమిటో కూడా ఒకసారి పరిశీలించుకోవాలి కాదా…

ప్రత్యేకించి 1990 తర్వాత ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీ.. ఎన్నికల ఫలితాల సరళి ఇలా ఉంది.

గతాన్ని పరిశీలించినప్పుడే వర్తమానం మీద కూడా ఒక అంచనాకు రాగలం. అందుకే ఒకసారి గతాన్ని పరిశీలించుకుందాం

1991 ఎన్నికలు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం..

పాతిక ఎంపీ సీట్లను గెలిచింది కాంగ్రెస్‌ పార్టీ. 45.6% ఓటు షేర్‌తో కాంగ్రెస్‌ ఇరవై ఐదు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. నేషనల్‌ ఫ్రంట్‌గా బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ పదమూడు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది. 32.3శాతం ఓటు బ్యాంకును సాధించింది. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, ఇతరులు ఒక్కోటి ఒక్కో సీటును సాధించాయి. వాటి ఓటు శాతం వరసగా.. ఆఫ్‌ 1.8, 1.9, 2.4,16 శాతం.

1996 ఎన్నికలు.. మళ్లీ కాంగ్రెస్‌ దే.. హవా..

మొత్తం ఇరవై రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. 39.7 ఓట్ల శాతంతో కాంగ్రెస్‌ ఆ స్థానాలను నెగ్గింది. టీడీపీ పదహారు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది. ఆ పార్టీకి దక్కిన ఓట్లశాతం 32.6. సీపీఐ రెండు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. 2.4% ఓట్లను దక్కించుకుంది. సీపీఎం, ఎంఐఎంలు చెరో సీటును సొంతం చేసుకున్నాయి. వాటి ఓట్లశాతం వరసగా.. 2.9, 1.1.

1998 ఎన్నికలు.. మళ్లీ కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు!

38.5శాతం ఓట్లతో కాంగ్రెస్‌ పార్టీ ఇరవైరెండు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. టీడీపీ పన్నెండు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. ఓట్లశాతం ముప్పై రెండు. బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను నెగ్గింది. దానికి వచ్చిన ఓట్లశాతం 18.3. రెండు పాయింట్‌ ఆరుశాతం ఓట్లతో సీపీఐ రెండు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. ఎంఐఎం ఒక సీటు, ఇతరులు మరో సీటును సొంతం చేసుకున్నారు.

1999 ఎన్నికలు.. తెలుగుదేశం విజయ పతాకం.

39.9% ఓట్లతో ఏకంగా ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లను తెలుగుదేశం సొంతం చేసుకుంది. బీజేపీ ఏడు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. దానికి వచ్చిన ఓట్లశాతం దాదాపు పది. కాంగ్రెస్‌ పార్టీ ఐదు ఎంపీ సీట్లలో విజయాన్ని సాధించింది. అయితే ఓట్లశాతం విషయంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే టాప్‌లో నిలిచింది. కాంగ్రెస్‌కు ఏకంగా 42.8శాతం ఓట్లు వచ్చాయి! ఎంఐఎం తన సీటును నిలబెట్టుకుంది.

2004 ఎన్నికలు.. వైఎస్‌ మ్యాజిక్‌!

ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లను కాంగ్రెస్‌ పార్టీ నెగ్గింది నాటి ఎన్నికల్లో. ఓట్లశాతం 41.6. ముప్పైమూడు శాతం ఓట్లు వచ్చిన టీడీపీ ఐదు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది. తెలంగాణ రాష్ట్రసమితి ఐదు ఎంపీ సీట్లను సాధించింది. 6.8శాతం ఓట్లు వచ్చాయి ఆ పార్టీకి. సీపీఐ, సీపీఎంలు చెరో ఎంపీ సీటును సొంతం చేసుకున్నాయి. వాటి ఓట్లశాతం 1.3, 1.

2009 ఎన్నికలు.. మళ్లీ వైఎస్సే..

తెరాస, కాంగ్రెస్‌లు విడివిడిగా పోటీచేశాయి. తెలుగుదేశం, కమ్యూనిస్టులు, తెరాస కలిసి పోటీచేశాయి. ప్రజారాజ్యం బరిలోకి దిగింది. అయితే విజయం మాత్రం కాంగ్రెస్‌నే వరించింది. ఆ పార్టీ ముప్పై మూడు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. ఓట్లశాతం ముప్పై తొమ్మిది. తెలుగుదేశం పార్టీ ఆరు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది. దానికి వచ్చిన ఓట్లశాతం దాదాపు పాతిక, తెరాస ఆరుశాతం ఓట్లతో రెండు ఎంపీ సీట్లను నెగ్గింది. ఎంఐఎం ఒక్క ఎంపీ సీటును సాధించుకుంది.

2014.. రాష్ట్ర విభజన అనంతరం..

రాష్ట్ర విభజనతో ఏపీలో పాతిక లోక్‌సభ సీట్లు మాత్రమే మిగిలాయి. టీడీపీ-బీజేపీ-జనసేనల కూటమిగా వచ్చాయి. జనసేన ఎన్నికల్లో పోటీచేయలేదు. తెలుగుదేశం, బీజేపీలు పదిహేడు ఎంపీ సీట్లను నెగ్గాయి. తెలుగుదేశానికి 40.8 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఏడుశాతం ఓట్లు వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోలోగా 45.7% ఓట్లను సొంతం చేసుకుంది. ఎనిమిది ఎంపీ సీట్లను దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *