బీజేపీయేతర పార్టీల నేతలందరూ ఢిల్లీలో మిస్సైన మిగ్ 21 పైలట్ క్షేమం కోసం ప్రార్థించారు.*

భారత వైమానిక దళాల ధైర్య సాహసాలను విపక్ష పార్టీలు ప్రశంసించాయి. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించాయి.

పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలు బుధవారం (ఫిబ్రవరి 27) మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమయ్యాయి.

ఈ సమావేశంలో 21 పార్టీల నేతలు పాల్గొన్నారు. భారత వైమానిక దళాల చర్యలను ఆయా పార్టీల నేతలు అభినందించారు. పార్లమెంట్‌ లైబ్రరీ హాల్‌లో జరిగిన సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు మీడియాతో మాట్లాడారు.

భారత పైలట్ మిస్సైన వార్తలు తమను తీవ్రంగా కలచివేశాయని విపక్ష నేతలు అన్నారు. పైలట్ క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ దీన్ని అవకాశంగా వాడుకోవడానికి.ప్రయత్నించొద్దని సూచించారు. పైలట్‌ను క్షేమంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని నేతలు ఆరోపించారు. సంకుచిత రాజకీయాల కోసం దేశ భద్రతను ఫణంగా పెట్టొద్దని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి మండిపడ్డారు.

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో జాతి ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని వ్యాఖ్యానించారు. పాక్ కవ్వింపు చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలు ఆజాద్‌, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ,
ఎల్‌జేడీ నేత శరద్‌ యాదవ్‌, టీఎంసీ నేత డెరిక్‌ ఓబ్రెయిన్‌, శిబూ సోరెన్‌ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మరోసారి సమావేశమవుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *