మళ్లీ రెచ్చిపోయిన ముష్కరులు.. కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్

పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసి 350 మంది ఉగ్రవాదులను హతమార్చి ఒక రోజైనా గడవక ముందే ముష్కరులు మరోసారి కశ్మీర్‌లో రెచ్చిపోయారు.

నియంత్రణ రేఖను దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం భీకర దాడులు చేసి 24 గంటలైనా గడవకు ముందే ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.

షోపియాన్ జిల్లా మీమండార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం సైన్యం గాలిస్తోన్న సమయంలో ఒక్కసారిగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. మీమండార్‌లోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్టు భావిస్తున్నారు.

ఆర్మీ 23 పారా దళాలు, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోందని, దీని గురించి సమాచారం తర్వాత వెల్లడిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

తాజా సమాచారం ప్రకారం ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిని సైన్యం తన అధీనంలోకి తీసుకున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించింది.

జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో మంగళవారం సాయంత్రం నుంచి కాల్పులకు తెగబడుతోంది.

జమ్మూ, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లో సరిహద్దు గ్రామాల్లోని సామాన్య పౌరులే లక్ష్యంగా భారీ ఆయుధాలు, మోర్టార్లలతో దాడులకు పాల్పడుతోంది.

దీంతో పలు చోట్ల ఇళ్లు ధ్వంసం కాగా,ఐదుగురు భారత జవానులు గాయపడ్డారు.
పాక్ చర్యలకు భారత సైన్యం కూడా ధీటుగా స్పందించింది.

పాకిస్థాన్‌కు చెందిన ఐదు సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. పెద్దసంఖ్యలో పాక్‌ సైనికులు మృతిచెంది ఉంటారని ఓ భారత సైన్యాధికారి వెల్లడించారు.

మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌కు చెందిన కీలక స్థావరంపై జరిగిన వైమానిక దాడిలో 350 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు భారత్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *