మళ్లీ జగనే… టార్గెట్ చేస్తున్న పవన్…!

ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న వ్యక్తి కేవలం వైఎస్ జగన్  మోహన్ రెడ్డి మాత్రమేనా? కానీ… పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఈ విషయంతో ఏకీభవించరు. ఎందుకంటే పవన్ కల్యాణ్  సీఎం కావాలని ఆయన అభిమానులకు కూడా ఉంది. అయితే.. జనసేన అధిపతి మళ్లీ మరో పాత విషయాన్ని వివరించారు. అదేమిటంటే.. ఆయన సీఎం కావాలని అనుకోవడం లేదు అని…

ఇది నిన్నటి మాట. రేపటి మాట ఏమిటో కానీ.. పవన్  సీఎం కావాలని అనుకోవడం లేదట. మరి ఈయనే కదా.. ‘ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా..’అని ఎలుగెత్తి ప్రశ్నించింది.. అనే  డౌటు ఎవరికీ రాకూడదు.

రేపు ‘నేను సీఎం కావాలనుకోకూడదా..’అని పవన్ ప్రశ్నిస్తే.. ఈయనే కదా తనకు సీఎం కావాలని లేదు అని ప్రకటించింది.. అనే విషయాన్నీ గుర్తుకు తెచ్చుకోకూడదు.

తను జగన్ లా సీఎం కావాలని అనుకోవడం లేదని పవన్ కల్యాణ్ సెలవిచ్చారు. తను అసలు సీఎమ్మే కావాలని అనుకోవడం లేదని కూడా చెప్పారు! అయితే తాము ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపుతామని మాత్రం  పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇక తన సినిమాలను వంద రోజులు ఆడనిచ్చారని.. టీజీ వెంకటేష్ మీద తనకు కోపం రావడం లేదని పవన్ కల్యాణ్ చెప్పుకోవడం మరోమెరుపు! తన విషయంలో టీజీ అనుచితంగా మాట్లాడినా.. తనకు మాత్రం ఆయన మీద కోపం రావడం లేదని పవన్ చెప్పుకొచ్చారు.

తన సినిమాలు మూడు టీజీ వెంకటేష్ థియేటర్లో హండ్రెడ్ డేస్ ఆడాయని.. అందుకే ఆయన పై తనకు కోపం లేదని పవన్ చెప్పుకొచ్చారు. తను వద్దు అనడం వల్లనే టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు దక్కిందని పవన్ చెప్పారు!

మొత్తానికి తన అజెండా  ఏమిటో పవన్ కల్యాణ్ చెప్పకనే చెబుతున్నారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే తప్ప.. తను ఏదో అధికారంలోకి వస్తాననే విశ్వాసం పవన్ లో ఏ మాత్రం కనిపించడం లేదు. జగన్ సీఎం కావాలనుకుంటున్నారు.. అంటూ అదేదో ద్రోహం అయినట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేసుకొంటూ ఉన్నారీయన. 

జగన్ సీఎం కావాలని అనుకుంటున్నారు.. అందులో ఎవరికీ అనుమానాలు లేవు. అయినా  పవన్ కల్యాణ్ దాని మీద ఏదో రాజకీయం చేసేద్దామని అనుకుంటున్నట్టుగా ఉన్నారు. తన సీఎం కోరిక మీద పవన్ లాగా పూటకో మాట మాట్లాడటం లేదు జగన్. ఈ విషయాన్ని జనసేన అధిపతి గుర్తిస్తే మంచిదేమో. చంద్రబాబును పల్లెత్తు మాట అనుకుండా.. ఇలా ఎన్ని రోజులు పవన్ జగన్ గురించి మాట్లాడుతూ ఉంటారో! ఏం చేసినా ఇంకో రెండు నెలలే మాత్రమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *