ఈ రోజు నుంచి ఏపీలో తలసాని పర్యటన .. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

లోక్‌సభతోపాటు ఏపీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నెల రోజుల వ్యవధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ పర్యటనకు మరోసారి వెళ్లనుండటంతో ఆసక్తి నెలకుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. బుధవారం నుంచి రెండు రోజల పాటు ఆయన ఏపీలో పర్యటిస్తారు.

గుంటూరు, ద్రాక్షారామంలలో జరిగే వివాహ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. జనవరిలోనూ ఏపీలో పర్యటించిన తలసాని, తప్పకుండా తాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని ప్రకటించారు.

అంతేకాదు, ఏపీలోని బీసీలకు తాను నాయకత్వం వహిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ కావడానికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు.

కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ కుల రాజకీయం చేశారని, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో పరిపాలన సక్రమంగా లేదని విమర్శించిన తలసాని బీసీలను అవసరం కోసం వాడుకుంటున్నారు తప్ప.. వాళ్లకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు.

బీసీలకు రాజ్యాధికారం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అమరావతిలో రాజధాని నిర్మాణం ఇప్పటివరకు నోచుకోలేదని తలసాని విమర్శించారు.

ఏపీ ప్రజలు చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బహుబలి సినిమాకు మించిన గ్రాఫిక్స్‌తో రాజధాని నిర్మాణం జరుగుతున్నట్లు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

దీంతో తలసానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా..? అని తలసానిని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనరాదని, ఒకవేళ ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి..స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

తెలంగాణలో 26కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని.. అదే టీఆర్ఎస్ నేతలు ఏపీకి వచ్చి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *