గంగూలీ ఫ్యామిలీలో మళ్లీ కరోనా.. హోమ్ క్వారంటైన్‌లో మాజీ కెప్టెన్

సౌరవ్ గంగూలీ ఫ్యామిలీని కరోనా వైరస్ వీడటం లేదు. గత నెల 20న అతని సోదరుడు స్నేహశీష్ గంగూలీ భార్యకి కరోనా పాజిటివ్‌గా తేలగా..

తాజాగా స్నేహశీష్ ఆ వైరస్ బారినపడ్డాడు. ఇటీవల గంగూలీ పుట్టిన రోజు వేడుకలకి ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు.

అతని సోదరుడు స్నేహాశీష్‌ గంగూలీకి తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో సౌరవ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.

టీమిండియా‌కి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా కితాబులందుకున్న సౌరవ్ గంగూలీ.. ఈ నెల 8న 48వ పుట్టినరోజు వేడుకులు జరుపుకున్నాడు.

ఆ వేడుకలకి స్నేహాశీష్‌ కూడా హాజరు కావడంతో గంగూలీతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిస్క్‌లో పడ్డారు.

వాస్తవానికి గత నెల 20న స్నేహాశీష్‌ భార్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అతనికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) సెక్రటరీగా పనిచేస్తున్న స్నేహాశీష్ ఆ వార్తల్ని ఖండించాడు.

క్యాబ్ కూడా తమ సెక్రటరీ ఆరోగ్యంగా ఉన్నాడని.. అతను రోజూ ఆఫీస్‌కి వస్తున్నట్లు ఒక ప్రకటనని విడుదల చేసింది.

అయితే.. గత కొద్దిరోజులు స్నేహాశీష్ జ్వరంతో బాధపడుతుండటంతో కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది.

స్నేహాశీష్‌కి కరోనా పాజిటివ్‌‌గా రావడంతో తాను హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నట్లు బీసీసీఐకి గంగూలీ తాజాగా సమాచారం అందించగా..

స్నేహాశీష్‌‌కి కరోనా పాజిటివ్ విషయాన్ని క్యాబ్ కూడా అధికారికంగా ధ్రువీకరించింది.

ప్రస్తుతం స్నేహశీష్ బెల్లె వి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గంగూలీతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కనీసం 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *