ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ ఎంట్రీ కాంగ్రెస్ లో ప్రియాంకం :యూపీ తూర్పు ప్రాంతం జనరల్ సెక్రటరీ గా నియామకం

లక్నో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కుమార్తె, ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఖాయమైంది. ఇప్పటివరకు అడపాదడపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లోని కాంగ్రెస్ విభాగం జనరల్ సెక్రెటరీగా ఆమె నియమితులయ్యారు. యూపీ పశ్చిమ భాగంలో ని కాంగ్రెస్ విభాగం జనరల్ సెక్రటరీ గా జ్యోతిరాధిత్య సింథియాను నియమించారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ(ఆర్గనైజేషన్)గా కేసీ వేణుగోపాల్ నియమిస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. యూపీ తూర్పు ప్రాంతానికి భాజపా తరపు నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక వాద్రాను ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే రంగంలోకి దించారు. ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడం పై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోహ్రా మాట్లాడుతూ చాలా కీలక బాధ్యతను ప్రియాంక గాంధీకి అప్పగించారని అన్నారు. యూపీ తూర్పు ప్రాంతాన్నే కాకుండా ఇతర ప్రాంతాల్లోను ఆమె ప్రభావం కనిపించనందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్బరేలి , అమేథి ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. అఖిలేశ్- మాయావతి పొత్తు నేపథ్యంలో యూపీలో ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *