ఆగస్టు 17 నుండి రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని.. సీఎం కేసిఆర్!

ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ తరగతులు.. ఫైనల్ ఇయర్ వాళ్లకు మాత్రమే పరీక్షలు
విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు.
కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
విద్యావ్యవస్థ పవిత్రత (academic sanctity)ను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని తెలిపారు.
ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించారు.
విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుందని వెల్లడించారు.
ఈ రోజు విద్యా శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
విద్యా సంవత్సరం ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసులు, ఎంసెట్‌తో సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ, యూజీసీ ప్రకటన నేపథ్యంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ప్రణాళిక తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి: సీఎం కేసీఆర్
ప్రభుత్వ విద్యాసంస్థల తీరు గణనీయంగా మెరుగుపరిచి.. అత్యుత్తమ పనితీరు జరిగేలా చేస్తేనే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు, ఇతర విద్యా సంస్థలను గొప్పగా తీర్చిదిద్దేందుకు అనుభవజ్ఞులతో చర్చించి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.