అరకు లోక్‌సభలో తండ్రీ కూతుళ్ల సవాల్.. మూడో వ్యక్తికే లాభమా?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కొడిగట్టిన దీపంలా మారింది. నేతలందరూ తలోదారి వెతుక్కోగా ఒకటీ అరా ఆ పార్టీ జెండాను మోస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో పోటీకి తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.

1.అరకు లోక్‌సభ స్థానంలో ఆసక్తికరంగా మారిన పరిణామాలు.
2.టీడీపీ అభ్యర్థి కుమార్తెకే టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.
3.కాంగ్రెస్ అభ్యర్థిగా వైరిచర్ల కిశోర్ దేవ్ కుమార్తె శ్రుతి.

ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

మొత్తం 132 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు.

ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు, జేడీ శీలం, చింతా మోహన్‌లు ఉన్నారు.

ఇదిలా ఉండగా, అరకు లోక్‌సభ స్థానం నుంచి ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ను తన అభ్యర్థిగా టీడీపీ నిర్ణయించింది.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆయన కుమార్తెకు సీటు ఖరారు చేయడం విశేషం.

వైరిచర్ల కుమార్తె శ్రుతీదేవిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించగా, ఆమె తన తండ్రిని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గొడ్డేటి మాధవి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అరకు పార్లమెంటులో ఈసారి త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినప్పుడే తన కుమార్తె శ్రుతీదేవి ఆమెకు నచ్చిన పార్టీలో ఉన్నారని, రాజకీయంగా ఆమెతో ఎటువంటి సంబంధం లేదని వైరిచర్ల ప్రకటించారు.

అంతకు ముందే శ్రుతీదేవి కాంగ్రెస్‌ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కిశోర్‌ చంద్రదేవ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కుమార్తె శ్రుతీదేవి లా పూర్తిచేసి ఢిల్లీలో ఉంటున్నారు. కురుపాం కోటకు ఆమె నిత్యం వచ్చి వెళుతుంటారు.

పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నా జనంతో అంత కలివిడిగా ఉండరు. మీడియా కంటపడినా కనీసం మాట్లాడరు.

ఒకటి రెండు పర్యాయాలు గిరిజన మహిళా సంఘాలతో మాటా మంతి తప్పితే సాధారణ పౌరులతో ఎటువంటి సత్సంబంధాలు లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *