చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరేమో:వైఎస్ జగన్

వాసు అన్నను మంత్రిని చేస్తా: వైఎస్ జగన్
‘రాష్ట్ర ప్రభుత్వంలోని 1.25 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి జీతాలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు పూర్తిగా బంద్ చేశారు.
ఉద్యోగులు తమ జీపీఎఫ్ డబ్బులు తీసుకోకుండా అంక్షలు పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 1800 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు.
మధ్యాహ్న భోజన పథకానికి బిల్లులు ఇవ్వకుండా పిల్లల్ని సైతం ఇబ్బందులు గురిచేస్తున్నారు.
చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరేమో.సీపీఎస్ నిధులను సంబంధిత నిధులకు ఇవ్వకుండా చంద్రబాబు వాడేశారు. పోలీసులకు టీఏ, డీఏ పూర్తిగా బంద్ చేశారు.
ఇలాంటి చంద్రబాబు చంద్రబాబుకు తిరిగి అధికారం అప్పగిస్తే పేద ప్రజలకు రేషన్ కూడా దొరకని పరిస్థితి వస్తుంద’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదించమని కోరిన వైఎస్ జగన్.. వాసు అన్నను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.
ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. వైఎస్ జగన్ సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో ఒంగోలు రహదారులు కిక్కిరిసిపోయాయి.
మండుతున్న ఎండలను లెక్కచేయకుండా అక్కడికి తరలివచ్చిన వారికి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
పేదవాడిని నట్టేటా ముంచారు..
ఇంకా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏ విధంగా దోపిడి చేస్తున్నారో గమనించండి. పేదవాడికి ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పి ప్రజలను నట్టేటా ముంచారు.
పేదలకు ఇచ్చే మూడు వందల అడుగుల ప్లాటును ఆరు లక్షల రూపాయలకు విక్రయించేందుకు పథకం రచించారు. 3లక్షల రూపాయల కూడా దాటని ఫ్లాట్లను చంద్రబాబు పేదలకు 6లక్షలకు అమ్ముతున్నారు.
అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు.
లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా?. చంద్రబాబు ఇచ్చిన ఫ్లాటులను తీసుకున్న వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3లక్షల రూపాయలను మాఫీ చేస్తాం. ఇలా అన్ని వర్గాల ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు నేనున్నాను..
ఈ జిల్లాలో భారీగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ముందకు రాలేదు. కానీ అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు బినామీలు, మంత్రులు అడ్డగోలుగా దోచుకున్నారు.
ప్రతి అగిగోల్డ్ బాధితునికి నేను ఉన్నానని హామీ ఇస్తున్నాను. ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది?.
మురుగు నీరు కనిపించకుండా కాలువలను వంద కోట్లతో ఆధునీకరణ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆధునీకరణ జరిగిందా?.
వైఎస్సార్ పథకాలే ఈ రోజుకు గొంతు తడుపుతున్నాయి..
గత ఎన్నికల సమయంలో ఒంగోలులో రోజు త్రాగునీరు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ మూడు రోజు మూడు రోజుల కొక్కసారైనా నీళ్లు వస్తున్నాయా?.

ఆ మాత్రమైనా నీళ్లు వస్తున్నాయంటే పదేళ్ల కిందట దివంగత నేత రామతీర్థం ప్రాజెక్టును కట్టడం వల్లనే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇస్తానని చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టారు.
ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాలలో వైఎస్సార్ చేపట్టిన నీటి పథకాలు ఈ రోజుకు కూడా గొంతు తడుపుతున్నాయి. పదేళ్లు గడిచిన జనాభా పెరిగిన అవసరాలకు తగ్గట్టు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన పాలకులకు లేదు.
ఇక్కడికి రిమ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్‌లు వైఎస్సార్ హయంలోనే వచ్చాయి. చంద్రబాబు హయంలో ఒక పరిశ్రమైన, ఒక యూనివర్సిటీ అయిన వచ్చిందా?. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు వస్తారు ఓ రాయి వేస్తారు, టెంకాయ కొడతారు వెళ్లిపోతారు.
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు…
కృష్ణా పోర్టు యాజమాన్యానికి మేలు చేయాలనే ఉద్దేశంతో.. రామయ్య పట్నం పోర్టును పూర్తిగా పక్కన పెట్టేశారు. రామయ్య పట్నం పోర్టుతో ఇక్కడి యువతకు ఉద్యోగాలు వస్తాయని కూడా పట్టించుకోలేదు. మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది మోసాలు, అబద్దాలు, అన్యాయాలు, అవినీతి. ఐదేళ్ల పాలన తరువాత చంద్రబాబు గురించి చెప్పాలంటే.. దేశంలో అత్యధిక ధనిక సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు అని రిపోర్టులు చెబుతున్నాయి.
ఆంధ్ర రాష్ట్రంలోని మన రైతన్న దేశంలోనే అత్యంత రుణ భారం కలిగి ఉన్నారని నాబార్డు నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య ఈ ఐదేళ్లలో రెట్టిపయింది. ఏ గ్రామానికి వెళ్లిన, ఏ పట్టణానికి వెళ్లిన నిరుద్యోగులే కనిపిస్తున్నారు.
ఉద్యోగాలు లేక వలసపోతున్నారు. 2014లో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారు.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.
కానీ ఏ ఒక్క నిరుద్యోగికి మాత్రం జాబు రాలేదు. అయిన కుమారుడికి మాత్రం మంత్రి పదవి ఇచ్చారు.
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టకపోయి ఉంటే.. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే ప్రతి ఇంటికి ఎంతో కొంత ఊరట కలిగేది.
చంద్రబాబు ఐదేళ్ల పాలన తరువాత జాబు రావాలంటే బాబు పోవాలన్న మాట వినిపిస్తుంది.
ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు 1.20 లక్షల బాకీ..
చంద్రబాబు నాయుడు పాలనలో ఉద్యోగాలు రావడం సంగతి పక్కన ఉంచితే.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి.
30వేల మంది ఆదర్శ రైతులు, 1000మంది గోపాలమిత్రల, ఆయూష్‌లో పనిచేస్తున్న 8000 మంది, సాక్షార భారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగాలు పోయాయి.
14 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85వేల మంది అక్కాచెల్లమ్మల ఉద్యోగాలు పోయాయి.
జీతాలు పెంచమని హోంగార్డ్‌ల నుంచి, ఆశా వర్కర్‌లు, అంగన్ వాడీలు అడుగుతూంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
57 నెలలు అన్యాయాలు చేసిన చంద్రబాబు.. ఎన్నికలకు మూడు నెలల ముందు మోసం చేసేందుకు కూడా సిద్దపడ్డారు.
ప్రతి నిరుద్యోగికి 1.20 లక్షల రూపాయలు బాకీ పడ్డ చంద్రబాబు.. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి చేశానని చెప్పి టీవీల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు.
చదువుకున్న పిల్లలు కోచింగ్ సెంటర్‌లలో వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తుంటే చంద్రబాబు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పాదయాత్రలో నిరుద్యోగ ప్రతి సమస్య విన్నాను. వారికి నేనున్నానని హామీ ఇస్తున్నాను.
నిరుద్యోగులకు వైఎస్ జగన్ భరోసా..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తాం. ప్రతి ఊరిలోను గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తాం.
అందులో ఆ ఊరికి చెందిన చదువుకున్న పదిమందికి ఉద్యోగాలు ఇస్తాం. జన్మభూమి కమిటీలు ఉండవు, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ పథకాలకు, నవ రత్నాలకు సంబంధించి ఏ పని అయినా 72 గంటల్లో పూర్తి చేసేలా గ్రామ సచివాలయం పనిచేస్తుంది. ఇందులో కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమని హామీ ఇస్తున్నాను.
ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇస్తాం. వారికి గౌరవ వేతనం కింద 5000వేల రూపాయలు అందజేస్తాం.

ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యతలను వారే చూస్తారు. రేషన్, పింఛన్ ఇలా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు రావడం లేదు. గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తాం.
నిరుద్యోగ యువతకు వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద రుణం, సబ్సిడీ అందజేస్తాం. ఈ కాంట్రాక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం.
పరిశ్రమలు రావాడానికి భూములు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాం. ఇబ్బంది ఉన్న చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం. కానీ పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
కానీ మన ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిని మార్చేస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెస్తాం.
తొలి శాసనసభలోనే ఈ చట్టం చేస్తాం. ఈ పరిశ్రమల్లో చేరేందుకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాకు ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం.
అప్పుడే కూళ్లిపోయిన వ్యవస్థలో మార్పు వస్తుంది..
దేశంలో రేపు ఏ ఒక్కరు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉందని వార్తలు వెలువడుతున్నాయి. మనం 25 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలను గెలిపించుకుందాం. ప్రత్యేక హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతిస్తాం.
ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెట్టేవారు, హోటళ్లు కట్టేవారు ముందుకు వస్తారు. ఉద్యోగ సమస్యకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది.
ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. వీటి ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది.
రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత రావాలి. రాజకీయ నాయకులు చెప్పిన పని చేయకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ కూళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది.
వాసు అన్నను మంత్రిగా మీ ముందు ఉంచుతా..
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి.
ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి.
చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి.
జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ.
15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.
గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం.
అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.
45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం.
పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం.
ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ అన్నను గెలిపించండి మంత్రిగా మీ ముందు పెడతాను. ఎంపీ అభ్యర్థి శ్రీనన్న కూడా ఆశీర్వదించమ’ని కోరారు.