పక్కా ప్లాన్ ప్రకారం ..మేకులతో కూడిన ఇనుప రాడ్లతో చైనా.. కల్నల్ సంతోష్ బాబు పోస్టుమార్టం రిపోర్ట్..

గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది సైనికుల పోస్టుమార్టం రిపోర్ట్‌లో చైనా సైనికుల దురాగాతాలు బహిర్గతం అయ్యాయి.

చైనా సైనికులతో ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు పోస్టుమార్టం నివేదికలో విస్మయం గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి.

ఆయన శరీరంపై గాయాలు లేనప్పటికీ తల భాగంలో మాత్రం కమిలిన గాయాలను గుర్తించారు. నీటి మునగడం వల్ల సంతోష్ బాబుతోపాటు మరో ఇద్దరు సైనికులు చనిపోయారని భావిస్తున్నారు.

అమరులైన 20 మంది సైనికుల మృతదేహాలకు లేహ్‌లోని ఎస్ఎన్ఎం హాస్పిటల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కొంత మంది సైనికుల శరీరం, ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నాయని తేలింది.

17 మంది సైనికుల మృతదేహాలపై గాయాలను గుర్తించారు.

మేకులతో కూడిన ఇనుప రాడ్లతో చైనా బలగాలు భారత సైనికులపై దాడి చేశారని పోస్టుమార్టం రిపోర్ట్ సూచించింది.

దీంతో పక్కా ప్లాన్ ప్రకారం చైనా బలగాలు గాల్వన్ లోయలో భారత సైనికులపై దాడి చేశాయని పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థం అవుతోంది.

ముగ్గురు సైనికుల ముఖాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మరో ముగ్గురి మెడ భాగంలో కోసిన గుర్తులున్నాయి.

దీంతో చైనా సైనికులు కత్తులను తీసుకొచ్చారని అనుమానిస్తున్నారు. 14 వేల అడుగుల ఎత్తున ఉన్న లడఖ్ ప్రాంతంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గాయపడటానికి తోడు అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల 12 మంది సైనికులు చనిపోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ముందుగా చెక్‌పోస్టును తొలగించిన చైనా తర్వాత ఉద్దేశపూర్వకంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేసి దాడికి ప్లాన్ చేసిందని సమాచారం.

ఈ విషయం తెలిసినా చైనా దాడి చేసే ప్రమాదం ఉందని అర్థమైనా సంతోష్ బాబు నాయకత్వంలోని సైన్యం వెనక్కి తగ్గలేదు.

చెక్‌పోస్టును తొలగించడానికి మన సైనికులు వెళ్లగానే చైనా బలగాలు రాళ్లతో దాడికి దిగాయి. అప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో ఇనుప రాడ్లు, ఇనుప మేకులున్న కర్రలతో దాడికి దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *