సరిహద్దుల్లో ఘర్షణ.. ఈ నెల 23న భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ

సరిహద్దుల్లో ఘర్షణ.. ఈ నెల 23న భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ
జూన్ 23న భారత్, రష్యా, చైనా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది.
గాల్వన్ లోయ వద్ద భారత్, చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే, సరిహద్దుల్లో చైనా, భారత్ ఘర్షణలతో విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదాపడుతుందనే ప్రచారం సాగింది.
కానీ, షెడ్యూల్ ప్రకారమే జూన్ 23న సమావేశం జరుగుతుందని రష్యా విదేశాంగ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఈ సారి సమావేశానికి ఛైర్మన్‌గా రష్యా వ్యవహరిస్తోంది. దీంతో, సమావేశంపై నిర్వహణపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. కాగా, ఈ సమావేశంలో గాల్వన్ లోయ ఘర్షణను లేవనెత్తునున్నట్టు భారత్ స్పష్టం చేసింది.
సోమవారం (జూన్ 23న) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుండగా.. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొంటారు.
ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కోవిడ్-19 పరిస్థితులు, ఆర్ధిక సంక్షోభం తదితర అంశాలపై చర్చించనున్నారని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జాకరోవా తెలిపారు.
సమావేశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనకు ముందు భారత్, చైనా ఘర్షణలపై రష్యా అధ్యక్షుడి ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ ప్రకటన చేశారు.
చైనా, భారత్ సమన్వయం పాటించాలని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
అంతేకాదు, ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తేవడానికి ఇరు దేశాలూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
భారత్, చైనాలతో తమకు చాలా సన్నిహిత, పరస్పర సంబంధాలు ఉన్నాయని పెస్కోవ్ వ్యాఖ్యానించారు