కమలం గాజు గ్లాసు కలయికపై పవన్ కు ప్రొఫెసర్ నాగేశ్వర్ పది ప్రశ్నలు…

అన్న కాంగ్రెస్‌లో కలిపినట్లు, తమ్ముడు బీజేపీలో కలిపినా అది పవన్ ఇష్టం. కాదనలేం. కానీ మనకు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు నేర్పింది ఏంటంటే ప్రశ్నించడం. నేను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పారు కనుక., పవన్ కల్యాణ్‌ను అభివనించేవారు కూడా ఆయన్ని ప్రశ్నించాలి. మీరు పవనిజాన్ని ఆచరించాలనుకుంటే.. మీరు పవనిజాన్ని విశ్వసించాలనుకుంటే, పవన్ కల్యాణ్ తాజా ఎపిసోడ్‌ను ప్రశ్నించాలి.
- పవన్ కల్యాణ్‌కూ నరేంద్రమోదీ మధ్యకానీ, జనసేనకు, బీజేపీ మధ్య కానీ ఉన్న సైద్ధాంతిక అనుబంధం ఏంటి? బీజేపీ సైద్ధాంతిక భూమికకు, పవన్ కల్యాణ్ ఆలోచనా విధానానికి ఎక్కడా పొంతన ఉండదు. ఇప్పుడు ఎలా కలుస్తున్నారు?
- ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఇప్పుడు తాజా లడ్డూలు, పాచిపోయిన లడ్డూ ఇవ్వలేదు. ఈ రెండు ఇవ్వకుండా ఎందుకు కలిసారు? ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎందుకు కలిసారు?
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ కలయికతో కలిగే లాభం ఏంటి?( రెండు రాజకీయ పార్టీల కలయిక ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి) వారికి నిర్ధుష్టంగా దక్కేదేంటి?
- 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కోసం వచ్చాం. రేప్పొద్దున పదవుల కోసం కాదు అని చెప్పారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండేందుకు వచ్చిన మీరు ఐదారేళ్లలో ఇన్ని రాజకీయ పల్టీలు ఎందుకు కొడుతున్నారు?
- 2019 మేలో మీరు బీజేపీకి వ్యతిరేకంగా కమ్యునిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఏడు నెలల్లోనే మీరు బీజేపీతో కలుస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఈ ఏడు నెలల్లో రాజకీయ వాతావరణంలో ఏ మార్పు వచ్చింది? ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏం కొత్తగా చేసింది?
- టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటేనని వైఎస్సార్‌సీపీ ఎన్నికల సమయంలో ప్రజలకు పదే పదే చెప్పింది. దీన్ని మీరు అప్పట్లో ఖండించారు. కానీ ఇవ్వాళ వ్యవహారం చూస్తుంటే మూడు పార్టీలు మళ్లీ కలవడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ పవన్ కల్యాణ్ కలిశారు. టీడీపీ కూడా బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. తాజా పరిణామాలు ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ చేసిన విమర్శలు నిజం అవుతున్నాయి కదా? దీనిపై మీ సమాధానం ఏంటి?
- భవిష్యత్‌లో పార్టీ విలీనం చేస్తారు అని వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మీరు మాటివ్వగలరా.. మీ అన్న చిరంజీవి పార్టీని విలీనం చేసినట్టుగా.. జనసేనను బీజేపీలో కలపరు అని?
- ఇలా ఒకసారి టీడీపీతో.. ఒక సారి బీజేపీతో కలవడం వల్ల మీరు ప్యాకేజీలు తీసుకొని మారుతున్నారు అని అంటున్నారు? దీనిపై మీ అభిమానులకు సమాధానం చెప్పాలి?
- రాజధానే ప్రాతిపాదిక అయితే బీజేపీతోనే కలవాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు జేఏసీలో ఉండవచ్చు. ఎందుకు అలా చేయలేదు?
- అమరావతి విషయంలో బీజేపీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? ప్రత్యేక హోదా మీద ఏమైనా హామీ తీసుకున్నారా? ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కూడా కలవడానికి సిద్ధపడని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నట్లు? కలవడంలో ప్రాతిపదిక ఏంటి?