భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో కొనసాగతున్న వివాదం.. బంధీలుగా ఉన్న 10 మంది భారత సైనికులను విడుదల చేసిన చైనా

భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో గడచిన 50 రోజులుగా కొనసాగతున్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణలకు దారితీయగా.. 20 మందికిపైగా సైనికులు వీరమరణం పొందారు.

తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి డ్రాగన్ సైన్యాలు ఘర్షణకు దిగడంతో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 76 మంది గాయపడ్డారు.

దీంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకుంది. తాజాగా, ఏర్పడిన ఉద్రిక్తతలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనా, భారత్‌లు నిర్ణయానికి వచ్చాయి.

ఈ అంశంపై ఇప్పటికే లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జూన్ 6న చర్చలు జరిగాయి. మరోసారి శుక్రవారం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో తమ వద్ద బంధీలుగా ఉన్న 10 మంది భారత సైనికులను చైనా గురువారం సాయంత్రం విడుదల చేసింది.

జూన్ 15న గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో భారత జవాన్లను చైనా బందీలుగా చేసుకుంది.

నలుగురు అధికారులు సహా 10 మంది సైనికులను విడుదల చేయడానికి లేహ్ పదాతిదళ విభాగం కమాండర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపాట్, చైనా పీపుల్స్ ఆర్మీ సైనికాధికారి మధ్య గురువారం చర్చలు జరిగాయి.

ఈ చర్చల ఫలితంగా బందీలుగా ఉన్న 10 మంది సైనికులను విడుదల చేశారు.

గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో బీహార్ 16 రెజ్మింట్‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీరమరణం పొందగా.. 10 మందిని చైనా బంధించింది.

వీరిని సురక్షితంగా చైనా చెర నుంచి విడుదల చేయడానికి మేజర్ జనరల్ స్థాయి అధికారులు మూడుసార్లు చర్చలు సఫలమయ్యాయి.. చివరకు గురువారం వారిని విడుదల చేసింది.. వైద్య పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.

కల్నల్ సంతోష్ బాబు, మరో ఇద్దరు సైనికులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 17 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరో 76 మంది గాయపడగా.. వీరిలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 58 మందికి స్వల్పగాయాలైనట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం వీరంతా లేహ్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన సైనికులు పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ఇక, చైనా మాత్రం తమ సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయిందీ వెల్లడించలేదు. దీనిపై గుంభనంగా ఉన్న డ్రాగన్.. మౌనం వహిస్తోంది.

అయితే, శత్రువులవైపున 45 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వీరిలో ఇద్దరు అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *