అసలే వర్మ… ఆపై భీభత్సమైన ఇమేజ్ ఉన్న హీరోపై సినిమా..ట్రైలర్ వీక్షణకూ టిక్కెట్

పవర్‌స్టార్ సినిమా ట్రైలర్ వీక్షణకూ టిక్కెట్: వర్మ
Ram Gopal Varma unveils release date of Power Star says ticket price
అసలే వర్మ… ఆపై భీభత్సమైన ఇమేజ్ ఉన్న హీరోపై సినిమా. ఇంకే ముందీ ఆయన మాటల్లో లెక్కలకు ఎక్కాల్లేవు. చేస్తున్న చేతలకు పగ్గాల్లేవు అన్నట్టుంది పరిస్థితి.
ఏమంటూ రామ్ గోపాల్ వర్మ తన అత్యంత అభిమాన హీరో(?) ని మనసులో ఉంచుకుని పవర్‌స్టార్ ప్రారంభించాడో గానీ… అక్కడి నుంచి దానిపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.
దీనిపై మీడియాలోనూ వర్మ ఆశించినంత హైప్ వచ్చేసింది. ఇంకేముంది? ఈ సినిమా విడుదల విషయంలోనూ అంతే అతి చేస్తున్నాడు వర్మ.
తాజాగా ఈ సినిమా విడుదలకు జులై 25తేదీని నిర్ణయించాడు వర్మ. సినిమాను 25న విడుదల చేయనున్నానని, అయితే టీజర్‌ను మాత్రం ఈ నెల 22నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.
విచిత్రం ఏమిటంటే… టీజర్ చూడాలనుకున్నాసరే.. టిక్కెట్ కొనాల్సిందే నట. దీనికి రూ.25 టిక్కెట్ ధర నిర్ణయించడం విశేషం.
ఇక సినిమా టిక్కెట్ ధర ముందుగా బుక్ చేసుకుంటే రూ.150 లేకుంటే 25వ తేదీ నుంచి రూ.250 చెల్లించాల్సి ఉంటుందంటూ వర్మ కొత్త కొత్త రేట్లు ప్రకటించేస్తున్నాడు.
ప్రపంచంలోనే తొలిసారి ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ సినిమా ట్రైలర్ వీక్షణకు అడ్వాన్స్ గా టిక్కెట్ బుక్కింగ్ పెట్టిన ఘనత తమ స్వంతమని ఆర్జవీ ఘనంగా చెప్పుకున్నాడు.
ప్రస్తుతం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ డాట్‌కామ్ ద్వారా ట్రైలర్ బుకింగ్ ప్రారంభమైందని, 22న ఉదయం 11గంటలకు ట్రైలర్ విడుదల కాగానే సినిమా టిక్కెట్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతుందని 25వ తేదీ సినిమా విడుదలతో అది ముగుస్తుందని ఆ తర్వాత బ్లాక్ బుకింగ్ పేరుతో రూ.250కి టిక్కెట్ ధర చేసుకుంటుందని ఆర్జీవి చెబుతున్నాడు. మొత్తం మీద ఈ కొత్త స్టైల్ వర్మకు కాసులు కురిపిస్తుందో లేదో చూడాలి.