ఎన్టీఆర్ సినిమా – నా రివ్యూ! – శ్రీధర్ నల్లమోతు

దాదాపు 25-27 సంవత్సరాల క్రితం NTRని చివరిసారిగా చూడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆయన గురించి వాళ్లూ, వీళ్లూ టివిల్లో, పేపర్లలో, రాజకీయ చర్చల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు భాష్యం చెప్పుకుంటూ ఆయన గురించి చెప్పుకోవడమే చూస్తున్నాం. మళ్లీ ఇన్నాళ్లకి NTRని కళ్లారా చూసిన అనుభూతి “NTR – కధానాయకుడు” మూవీ ద్వారా కలిగింది.

ఒక మహోన్నత వ్యక్తి యొక్క నిలువెత్తు వ్యక్తిత్వం ఆవిష్కరించడంలో క్రిష్‌కి ఎవరూ సాటిరారు. కష్టించే తత్వం, క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం, మహిళల పట్ల గౌరవం.. ఇలా అన్ని క్వాలిటీస్ కళ్లెదుట నిలిచాయి. కొన్ని సీన్లు ఒళ్లు గగుర్పొడిచాయి. నిజంగా మార్వలెస్ మూవీ!

ఈరోజు ఉదయం కాజువల్‌గా సినిమా రివ్యూలు చూశాను. చాలా స్లోగా ఉందనీ, డిజప్పాయింట్‌గా ఉందనీ, NTR కాదు బాలకృష్ణే కన్పించాడనీ ఇలా రకరకాల అభిప్రాయాలు చదివాను. ఇది జీవిత కధ, కల్పిత కధ కాదు. డ్రామా, పంచ్ డైలాగులు జతచేసి ఫాస్ట్ పేస్‌లో నడిపించడానికి! జీవితాలు ఇలాగే ఉంటాయి! ఇక NTR బదులు బాలకృష్ణే కన్పించాడని కొందరన్న మాట గురించి చెప్తాను. చాలా సీన్లలో మేనరిజం, లిప్ మూమెంట్స్ NTRని గుర్తు తెచ్చేలా బాలకృష్ణ నటించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఒక మనిషి జీవిత కధ. ఆ మనిషి బ్రతికి లేరు. ఆ మనిషిలా మరో మనిషి కన్పించాలంటే రజనీకాంత్ రోబో సినిమాలా పూర్తి గ్రాఫిక్స్ చేయాలి. ఇది గ్రాఫిక్స్ సినిమా కాదు, వ్యక్తిత్వపు సినిమా. సినిమా చూస్తున్నంత సేపూ బాలకృష్ణని గుర్తు తెచ్చుకుని ప్రతీ సీన్ కంపేర్ చేసుకుంటూ.. జడ్జ్ చేసే మహాత్ములకి ఓ నమస్కారం పెట్టొచ్చు. NTR జీవితంలో చూపించిన క్రమశిక్షణ, తన వృత్తిపట్ల తను చూపించిన అంకితభావం లాంటివేమీ మన మనస్సుని కదిలించకపోతున్నాయంటే లోపం సినిమాలో కాదు మనలో ఉంది. నా దృష్టిలో 10 రూపాయల పని చేసి 1000 రూపాయలు ఆశించే జనరేషన్‌కి ఒక సీన్ కోసం 20 గంటలు కళ్లు ఆర్పకుండా పడిన కష్టం అర్థం కాకపోవచ్చు.

అదీగాక NTR ఈ తరానికి సరిగా తెలిసి ఉండకపోవచ్చు. ఫేస్బుబ్ ట్రోలింగ్ పేజీల్లో బాలకృష్ణ, మాయావతి ఫొటోలను పక్కనపెట్టి చేసే కుళ్లు కామెడీకి పైశాచికత్వంలో నవ్వుకునే మన చవకబారు వ్యక్తిత్వాలకి.. NTR పాత్రలోని ఔన్నత్వం అర్థవవుతుందని ఆశించడం కొద్దిగా అత్యాశే అవుతుంది. ఒక మనిషి వృత్తికి, వ్యక్తిత్వాలకూ గౌరవం ఇవ్వలేని మన సంస్కారం చూసి జాలిపడాల్సిందే. ఏదేమైనా NTR చాలావరకూ ఈ జనరేషన్‌కి అర్థం కాని ఓ గొప్ప వ్యక్తిత్వం. ఇక్కడ బాలకృష్ణ మీదో, TDP మీదో కోపం ఉండి సినిమా బాలేదని అభిప్రాయ పడే వారూ కొందరు ఉండి ఉంటారు. Yeah..కుంచించుపొండి.. అలాగే ఓ షెల్‌లో ముడుచుకుపోయి ఇంకాస్త వ్యక్తిత్వాలు దిగజార్చుకుని అలాగే బ్రతికేయండి. ఈరోజు NTR మీద సినిమా వచ్చినా, రేపు రాజశేఖర్ రెడ్డి మీద వచ్చినా, కేసీఆర్ మీద వచ్చినా వాళ్ల జీవితంలోని గొప్పదనాన్ని ఒప్పుకోలేని మన సంకుచితత్వం చూసి జాలిపడడం తప్పించి, దాన్నుండి కాస్త జ్ఞానం కూడా పొందలేని మన చేతగానితనం గురించి చెయ్యగలిగిందేమీ లేదు.

చివరిగా ఒక మాట… NTR జీవితం ఓ గొప్ప వ్యక్తిత్వ వికాసపు పాఠం. నేర్చుకోగలిగితే చాలా గొప్ప లక్షణాలు నేర్చుకోవచ్చు.. లేదు లోపాలు వెదికి ఆ వ్యక్తిత్వాన్ని అతి కాజువల్‌గా తీసేసుకుంటే NTRకో, బాలకృష్ణకో, క్రిష్‌కో ఇంకొకరికో ఏమీ కాదు.. సాటి సమకాలీన మనిషి జీవితం నుండి కాస్త కూడా నేర్చుకోలేని మన అజ్ఞానం మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది. కష్టజీవి NTRకి మరో కష్టజీవిగా నా జోహార్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *