బీసీలపై దాడి అంటూ గోల చేసిన తెలుగు దేశం పార్టీ నేతలుకు అప్పుడు కులం గుర్తు రాలేదా.. టీడీపీపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే

తెలుగు దేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిప్పులుచెరిగారు.

అవినీతికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేస్తే బీసీలపై దాడి అంటూ గోల చేసిన తెలుగు దేశం పార్టీ నేతలు.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టయితే కులం గురించి ఎందుకు మాట్లాడలేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.

ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర శాసన మండలిలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారని, అభివృద్ధికి మేలు చేసే బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

మండలిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌ ఎమ్మెల్సీ మాదిరిగా కాకుండా వీడియో గ్రాఫర్‌గా మారారని ఎద్దేవా చేశారు.

శాసన మండలిలో టీడీపీ నేతల ప్రవర్తనను ప్రజలు చీదరించుకున్నారన్నారు.

గత పాలనలో వాటర్‌ ట్యాంకులు, అన్న క్యాంటిన్లు, పంచాయతీ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులకు పచ్చ రంగులు వేసిన టీడీపీ.. ఇప్పుడు రంగులపై గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు.

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో తెలిసిందని, ఏడాది కాలంలోనే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

గెలిచే అవకాశం ఉన్న సమయంలో ఎస్సీలను రాజ్యసభకు పంపకుండా.. ఓడిపోయే సమయంలో వర్ల రామయ్యను బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలించేందుకు 600 హామీలు ఇచ్చిన

చంద్రబాబు, అధికారంలోకి రాగానే విస్మరించారన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తుండటంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని కాకాణి గోవర్ధన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *