జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కనీసం ఇంగితజ్ఞానం ఉండాలంటూ ఘాటుగా విమర్శించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారన్నారు.

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోనంటున్న పవన్.. ఆయన మాత్రం జగన్, విజయసాయిని ఉద్దేశించి విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని అడిగితే మీరు కూడా చేసుకోండని చెప్పడమేంటో తనకి అర్థం కావడం లేదంటూ అంబటి సెటైర్లు వేశారు. కనీసం ఇంగితజ్ఞానం ఉండాలంటూ ఘాటుగా విమర్శించారు.

నిత్యం విమర్శలు చేయడం లేదనే తనకు మంత్రి పదవి రాలేదని.. బొత్సకు మంత్రి పదవి వచ్చిందని పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి ఘాటుగా స్పందించారు.

తనకు మంత్రి పదవి విషయం పార్టీ చూసుకుంటుందని.. కానీ రోజూ విమర్శలు చేసే పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజీలు ఎవరిస్తున్నారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.

ఆ తెనాలి బాబు.. లింగమనేని సాయంతో చంద్రబాబుతో బేరాలు కుదుర్చుకున్న సంగతి నిజం కాదా? అని నిలదీశారు.

పార్టీని సొంతగా నడుపుకుంటే బాగుంటుందని జనసేన కార్యకర్తలే బాధపడుతున్నారని అంబటి అన్నారు.

తన పార్టీని తానే నాశనం చేసుకుంటున్నారని వెంటనడుస్తున్న కార్యకర్తలు వాపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఎవరో మన బండికి ఆయిల్ కొట్టిస్తే.. మనం బండి నడిపితే బాగుండదంటూ సెటైర్లు వేశారు.

మన బండికి మనం ఆయిల్ కొట్టించుకుంటే ఆ కిక్కే వేరబ్బా అంటూ అంబటి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పార్టీని సొంతగా నడుపుకునేందుకు ప్రయత్నించాలంటూ చురకలంటించారు.

ఇసుక, ఇంగ్లిష్ తప్ప వేరే విషయాలు కనిపించడం లేదని అంబటి అన్నారు. టీడీపీ హయాంలో ఇసుక కొరత గురించి ఎన్నడైన ప్రశ్నించారా? అని నిలదీశారు.

ఇంగ్లిష్ మీడియంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరన్నారు.

వాళ్ల పిల్లలు.. మా పిల్లలు ఇంగ్లిష్ చదువుతారు. అందరి పిల్లలు ఇంగ్లిష్ చదువుకుంటే తప్పేంటని అంబటి ప్రశ్నించారు. అందరికీ ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

చంద్రబాబు ఇసుక దీక్షపై అంబటి స్పందించారు. పార్టీ అధ్యక్షుడు దీక్ష చేపడితే ఆయన పార్టీ ఎమ్మెల్యేలే హాజరుకాలేదన్నారు.

అలిపిరి ఘటనలో బతికి బయటపడ్డందుకు సంతోషమేనని.. కానీ తనకు భయమంటే తెలియదని బీరాలు పలకడం ఎందుకన్నారు.

అంత భయం లేకపోతే కేసీఆర్ ఒక్కమాట అంటే హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ చంద్రబాబు దూతగా వెళ్లి ఉంటాడని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లాడని తాను అనుకోవడం లేదన్నారు.

కేంద్రంలోని బీజేపీ నేతలు చంద్రబాబును రానివ్వరు కాబట్టి.. ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసమో పవన్ వెళ్లి ఉంటాడంటూ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *