బలమైన రాష్ట్రం ఎక్కువ పెట్టుబడులను తెస్తుంది – వైయస్ జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు అవినీతి రహిత పాలన అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలనతో ముందుకు వెళుతోందని, అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక ఉపన్యాసం చేశారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మాకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి మెట్రో సిటీలు లేకపోవడం ఇబ్బందికరమే. మా బలహీనతలు మాకు మీకు తెలుసు. కానీ మా బలాలు కూడా మీకు చెప్పాలి.

సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు మా సొంతం. సుస్థిర ప్రభుత్వం మాది. అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అందిస్తున్నాం. ఇటీవల చట్ట సభలోను చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలను కూడా తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలు మీకు చెప్పదల్చుకున్నా.

మాకు 970 కిలోమీటర్ల కోస్టల్‌ లైన్‌, నాలుగు ఓడ రేవులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది మా బలం. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. 86శాతం సీట్లు గెలుచుకున్నాం. పార్లమెంట్‌ సీట్ల పరంగా చూస్తే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా మాకున్నాయి. పారదర్శకమైన విధానాలు, అవినీతి రహిత పాలనకు కట్టుబడి ఉన్నాం. అన్ని స్థాయిల్లో విప్లవాత్మకమైన నిర‍్ణయాలు తీసుకున్నాం. పెట్టుబడులు పెట్టేవారికి ధైర్యం కల్పించే బాధ్యత మాది. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విద్యుత్‌ డిస్కంల పరిస్థితి దారుణంగా ఉంది.

20వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. డిస్కంలు సంక్షోభంలో ఉన్నాయి. రెవెన్యూ తక్కువ ఉండి, వ్యయం పెరిగితే డిస్కంలు పనిచేయలేవు. అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై (పీపీఏ) పునఃసమీక్షిస్తున్నాం. ఇది వివాదాస్పదమైన నిర్ణయం అని అంతా అనుకోవచ్చు.

కానీ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలి అంటే ఇది తప్పదు. వినియోగదారుల, పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ఎవరు నష్ట పోకూడదు అన్నదే మా విధానం. ఇవన్నీ మీకు తెలియాలి. అంతిమంగా పరిశ్రమలే ధరలు చెల్లించాలి. అందుకే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాం. ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. కానీ ఈ నిర్ణయం తప్పదు. మీకు వాస్తవాలు తెలియాలి అలానే మాపై విశ్వసనీయత పెరగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *