ఆ పత్రికకు ‘సమాజ’ స్పృహ కంటే ‘సామాజిక’ స్పృహ ఎక్కువ..!

నా దృష్టిలో ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు వెన్నుముక. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల కంటే పత్రికలకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అక్షరమే అనే ఆయుధాన్ని అర్ధమంతంగా ఉపయోగించాలి. ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రజలకు వారధిగా ఉండాలి. వండటం నుంచి వార్తలు పుట్టకూడదు. వాస్తవాల నుంచి వార్తలు పుట్టాలి. కలానికి కులం ఉండకూడదు. కలానికి నిప్పుకమ్మిలాంటి వాస్తవాలను బయటకు తీసి, రాసే దమ్ముండాలి. కాని.. ఆ పత్రికకు చంద్రబాబు అధికారంలో ఉంటే ఓ లెక్క.

చంద్రబాబు కాకుండా ఇంకొకరు అధికారంలో ఉంటే మరో లెక్క. సారాయి ఉద్యమం నుంచి అమరావతి వరకు ఆ పత్రిక చంద్రబాబు గొంతుక అయింది అనడంలో సందేహం లేదు. చంద్రబాబు ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ తరించిపోతుంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆహా..ఓహో. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న ప్రశ్నించడం. గుడ్డ కాల్చి ముఖాన వేయడం. వైఎస్‌ఆర్‌ ఉన్నప్పటి నుంచి ఆ పత్రికు అక్షరాలను అడ్డుపెట్టుకుని ఆడిపోసుకోవడమే తెలుసు. చంద్రబాబు పెద్ద మేధావి కూడా కాదు. పెద్ద పరిపాలకుడు కూడా కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం కూడా చేతకాదు. చంద్రబాబుకు తెలిసింది కుట్రలు, కుతంత్రాలు.

వెన్నుపోటు రాజకీయాలు. గ్రూప్‌లు కట్టడం. ప్రతి పనిలో స్వార్ధంగా ఆలోచించడం. కాని.. ఇవి ఏవీ బయటకు రావు. ఇవీ ఏవీ ఆ పత్రిక రాయదు. కారణం..చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంట్. చంద్రబాబు మేధావి అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు తీసుకు రాలేకపోయారు?. చంద్రబాబు గొప్పపాలకుడు అయితే..ఆరోగ్య శ్రీ ఎందుకు తీసుకురాలేదు..?. చంద్రబాబు విజనరీ అయితే..రైతు భరోసా లాంటి కార్యక్రమం ఎందుకు అమలు చేయలేదు..?. చంద్రబాబుకు సామాజిక స్పృహ ఉంటే..అమ్మ ఒడి లాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు.?. ఎల్లో మీడియా చెప్పినట్లు చంద్రబాబు విజనరీ అయితే..

ఐదేళ్లలో అమరావతిలో తాత్కాలిక భవనాలకే ఎందుకు పరిమితమయ్యారు?. లక్ష కోట్లతో ఒక్కచోటే రాజధాని ఎందుకు నిర్మించాలనుకుంటారు..?. చంద్రబాబు విజనరీ కాదు, పాలకుడు కాదు, గొప్ప ఆలోచనపరుడూ కాదు.. చంద్రబాబు కేవలం మీడియాను మేనేజ్‌ చేస్తూ రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు అమరావతిలో కూడా చంద్రబాబు చేస్తున్నది కూడా మీడియా మేనేజ్మెంటే..! అందుకే..ఆ కుల పత్రిక అక్షరాలు అమరావతి గురించి..అప్పుడో మాట..ఇప్పుడో మాట రాస్తున్నాయి.

ఇదే విషయాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బహిర్గతం చేశారు. డిసెంబర్ 24, 2018లో ఈనాడు పత్రిక అమరావతి ఏం రాసిందో చెప్పారు. అమరావతిలో లక్షా 9వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని ఆ పత్రిక రాసిన వార్తను మీడియా ముందుంచారు మంత్రి బొత్స సత్యనారాయణ. అటువంటి ఈనాడు పత్రిక ఈ రోజున అమరావతికి అసలు నిధులే అవసరంలేదని రాయడాన్ని కూడా గుర్తు చేశారు. అంతేకాదు..ఇప్పటికే అమరావతిలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని ఆ పత్రిక రాసిన రాతలపై ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకు ముందు ఓ గొంతుక, ఎన్నికల తరువాత మరో గొంతుకతో ఈనాడు పని చేస్తుందని బొత్స మండిపడ్డారు.

అమరావతి రూ.3 వేల కోట్లతో అయిపోతుందని రాశారు..మరీ రూ.42వేల కోట్లకు టెండర్లు ఎందుకు పిలిచారని బొత్స ఈనాడును ప్రశ్నించారు. చంద్రబాబు, ఈనాడు కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు దెబ్బ తీసే విధంగా రాస్తున్నారని మండిపడ్డారు బొత్స. ఈనాడు పత్రిక అన్ని జిల్లాల్లో ఎడిషన్లు పెట్టుకోవచ్చు.. పాలన మాత్రం ఒక్కచోటే ఉండాలా అంటూ లాజిక్‌తో ఈనాడును ప్రశ్నించారు. బ్రోకర్లు, దళారులు, రియల్ ఎస్టేట్‌ కోసం చంద్రబాబు, ఈనాడు పని చేస్తున్నాయని బొత్స నిప్పులు చెరిగారు. చంద్రబాబు సీఎం అయితే ఒక రకంగా..లేకుంటే మరో రకంగా ఈనాడు వార్తలు రాయడంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి బొత్స మాటల్లో ఆవేదన ఉంది. వాస్తవమూ ఉంది. అవును ఈనాడు మొదటి నుంచి వైఎస్‌ఆర్‌ కుటుంబ వ్యతిరేక వార్తలను వండి వారుస్తుంది. చంద్రబాబును నెత్తిన పెట్టుకుని మోసే ఈనాడు..వైఎస్‌ఆర్ కుటుంబం దగ్గరకు వచ్చే సరికి అవాస్తవాలను వండి వార్చడమే పనిగా పెట్టుకుంది. జర్నలిజం విలువలు మరిచి, పాత్రికేయ సూత్రాలు మరిచి ఈనాడు నడుచుకుంటుంది. తాను అనుకున్నవారే అధికారంలో ఉండాలని, తమ కులం చేతిలోనే పాలనా పగ్గాలు ఉండాలని రాసే ఈనాడు వార్తలు పత్రికా విలువలను మంటగలుపుతున్నాయి.

ప్రపంచ చరిత్రలో చాలా పత్రికలు వచ్చాయి..పోయాయి. తమ రాతలతో అదిరించి, బెదిరించిన పత్రికలు ప్రజలు ఛీదరించుకునే సరికీ కాలగమనంలో కనుమరుగయ్యాయి. నేనే రాజ్యామన్న ఫ్రాన్స్‌ చక్రవర్తి 14వ లూయినే నాశనమయ్యాడు. కారణం..ప్రజల మనోభవాలను, ఆలోచనలను గౌరవించకపోవడం వలనే. ప్రపంచాన్ని శాసించాలి అనుకున్న హిట్లర్ ఏమయ్యాడు..చివరికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కారణం..వాస్తవాల్లో బతకక పోవడం వలనే. అది ప్రజాస్వామ్యం కాని..నిరంకుశత్వం కాని..పాలనా అనేది ఎన్ని రూపాలుగా ఉన్నా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, మనోభావాలు గౌరవించాలి. లేనిపక్షంలో ఏ పత్రికకు అయినా..ఏ నాయకుడికి అయినా పతనం తప్పదు. ఇది నేను చెబుతున్నది కాదు..చరిత్ర చెబుతున్న సత్యం.

చంద్రబాబును కాపాడాలని ఎల్లో మీడియా. ఎల్లో మీడియానే మేనేజ్ చేసే చంద్రబాబు ఇద్దరూ ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నవారే. చంద్రబాబు మాటలు , ఎల్లో మీడియా రాతలు, మాటలు నమ్మితే వైఎస్ఆర్‌ సీపీకి 22 ఎంపీ సీట్లు, 151 అసెంబ్లీ సీట్లు వచ్చేవి కాదు. ఎందుకంటే..ప్రజలకు వాస్తవాలు తెలుసు. పనిగట్టుకుని వైఎస్‌ జగన్‌ మీద వార్తలు వండినా..ఎల్లో మీడియా మేధావులు బుర్రలు బద్దలు కొట్టుకున్నా ప్రజలకు చంద్రబాబు నిజస్వరూపం తెలుసు. 2014లో కూడా చంద్రబాబుపై ప్రజలు ప్రేమతో ఓటు వేయలేదు.

ఏదో అనుభవం ఉందని..దానికి తోడు అటుపక్క..ఇటుపక్క మోదీ, పవన్‌లను పెట్టుకుని గెలిచారు. 2019లొ వైఎస్‌ జగన్‌కు పడిన ఓట్లు ప్రజలు ప్రేమతో వేసినవి. 2014లో ప్రజలు చేసిన తప్పును సరిదిద్దుకుని వేసినవి. చంద్రబాబు కుటిల రాజకీయాలు, నక్కజిత్తుల ఎత్తులు, ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా ఎల్లో మీడియా బాధ్యతాయుతంగా వార్తలు రాస్తే ప్రజల మనసులు గెలుచుకుంటారు. లేదంటే..కాలగమనంలో కనుమరుగు కాక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *