ఇది ఓ ఎల్లో గ్యాంగ్ మైనింగ్ మాఫియా స్టోరీ!

చంద్రబాబు, లోకేష్‌లకు యరపతినేని, పేరం గ్రూపులకు ఉన్న లింకేంటి..?

టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్ట్ కీలక సూచన చేసిన సంగతి తెలిసిందే. యరపతినేని బ్యాంకుల లావాదేవీల్లోను అక్రమాలు జరిగాయని, ఈడీ కూడా విచారణ చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. దీంతో యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో వేలాది కోట్లు చేతులు మారాయని, ఇందులో టీడీపీ అగ్రనేతలకు హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారంలో విశాఖకు చెందిన పేరం గ్రూపుకు భాగం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పేరం గ్రూపు అధినేత హరిబాబు యరపతినేనికి స్వయానా వియ్యంకుడని సమాచారం. ఈ హరిబాబు యరపతినేనికి, టీడీపీ పెద్దలకు బినామీ అని ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈ పేరం హరిబాబు గత 5 ఏళ్ల టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగాడు.

దాదాపు 1200 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసి అతి కొద్ది కాలంలోనే అగ్రగామిగా ఎదిగారు. వాస్తవానికి పేరం హరిబాబు తండ్రి కేవలం 2 ఎకరాలు ఉన్న సాధారణ రైతు. అలాంటి సాధారణ రైతు కుటుంబంలో వచ్చిన పేరం హరిబాబు టీడీపీ పెద్దలకు బినామిగా వ్యవహరించడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో రియల్టర్‌గా ఎదిగారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటుంటారు. గతంలో ఈ పేరం హరిబాబు వద్ద 7 కోట్లు దొరికాయి. అప్పట్లో ఆ డబ్బు చంద్రబాబుదే అని విస్తృతంగా ప్రచారం జరిగింది. అదే సమయంలో నాటి కేంద్ర హోం మంత్రి పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు నన్ను చీకట్లో కలిశాడు అని చెప్పాడు. ఇక్కడే ఏదో తేడా కొడుతోంది.

ఇక వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నం కేసులో ముద్దాయి శ్రీనివాస్‌కు డబ్బు సమకూర్చింది..అదే విశాఖకు చెందిన పేరం గ్రూపు ఛైర్మన్ హరిబాబు అని ఆరోపణలు వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో కోడికత్తి కేసుకు, అక్రమ మైనింగ్‌కు కేసుకు ఒకదానితో ఒకటి లింకులు బయటపడుతున్నాయి.

అక్టోబర్‌లో జగన్‌పై హత్యాప్రయత్నం జరుగగా, జనవరిలో పేరం గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులలో కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అన్ని టీవీ ఛానళ్లు, పత్రికలలో వచ్చింది. దీంతో జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు హరిబాబే డబ్బు సమకూర్చిందనే అనుమానాలు బలపడుతున్నాయి. 2018 – 19 ఆర్థిక సంవత్సరంలో హరిబాబు బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తే ఈ విషయం బయటపడే అవకాశాలు ఉన్నాయి.

ఈ విషయాన్ని క్షుణంగా పరిశీలిస్తే శ్రీనివాస్‌కు, పేరం హరిబాబుకు, యరపతినేనికి, చంద్రబాబు, లోకేష్‌ల మధ్య లింకులు బయటపడుతున్నాయి. పేరం గ్రూపుకు ఒక్కసారిగా వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని ఆరా తీస్తే.. పేరం హరిబాబుకు, యరపతినేనికి మధ్య ఉన్న బంధుత్వం బయటపడింది. పేరం గ్రూపులో పట్టుబడిన డబ్బులు యరపతివేనని వైజాగ్, గురజాలలో తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది.

యరపతినేని సున్నపురాయి అక్రమ మైనింగ్‌లో కొట్టేసిన 500 కోట్లు పేరం గ్రూపులో పెట్టాడా..అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక్కడే హైకోర్ట్ కూడా యరపతినేని బ్యాంకు లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేసి ఈడీ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపింది. చంద్రబాబు, లోకేష్‌ల అండతోనే యరపతినేని గురజాలలో యధేచ్ఛగా అక్రమ మైనింగ్ దందా నడిపించాడని గురజాల ప్రజలు అంటున్నారు.

అక్రమ మైనింగ్‌లో సంపాందించిన సొమ్ముల్లో టీడీపీ పెద్దలకు యరపతినేని ఎప్పటికప్పుడు వాటాలు పంపించేవాడని ఆయన అనుచరులు అంటున్నారు. అక్రమ మైనింగ్ సొమ్ములో మెజారిటీ శాతం అగ్రనేతలు కొట్టేసి, మా నాయకుడని ఇరికించారని యరపతినేని అనుచరులు వాపోతున్నారు.

హైకోర్ట్ చెప్పినట్లు ఈ కేసును జగన్ సర్కార్ సీబీఐకి, ఈడీకి అప్పగిస్తే ఈ మైనింగ్ మాఫియాలో యరపతినేని, పేరం హరిబాబు, చంద్రబాబు, లోకేష్‌లకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలిసిపోయే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో ఎల్లోగ్యాంగ్ మైనింగ్ మాఫియా వ్యవహారం కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *