షర్మిళ బాణాన్ని సంధించనున్న వైసీపీ!

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నకు తోడుగా వైఎస్ షర్మిళ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. 27న మంగళగిరి నుంచి ఆమె ప్రచారం ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

1.వైఎస్ జగన్‌కు తోడుగా ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
2.షర్మిళ 27వ తేదీన మంగళగిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
3.షర్మిళ సుమారు 50నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

ఎన్నికల తేదీ దగ్గరకొస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సూర్యడి భగభగలను మించి హీట్ పెంచుతోన్న ఏపీ రాజకీయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

అధికారం కోసం ఎవరికి వారు తమ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రశస్త్రాలను బయటకు తీస్తున్నారు.

ఇప్పటికే పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, వైసీపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ సహా కీలక నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు.

వైసీపీ అధినేత జగన్ సైతం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రజలను మరింత ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ విజయమ్మ, షర్మిళతో ప్రచారం చేయించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

టీడీపీ తరపున మంత్రి లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచే షర్మిళ ప్రచారం ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది.

షర్మిళ 27న మంగళగిరి నుంచి ప్రచారం ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సుమారు 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

వైఎస్ విజయమ్మ కూడా వైసీపీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేయించేలా వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

షర్మిళ, విజయమ్మ ప్రచారంతో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్నది ప్రతిపక్ష పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. వీరిద్దరి ప్రచారం కోసం రెండు బస్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

2012లో చేపట్టిన పాదయాత్రలో భాగంగా తాను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిళ వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకుంది.

అయితే ఎన్నికల సమయంలో తప్ప షర్మిళ పార్టీలో యాక్టివ్‌గా ఉన్న సందర్భాలు లేవు.

ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారిన ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ షర్మిళ బాణాన్ని మరోసారి సంధిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *