వృద్ధాప్యంతో పాటు కరోనాతో బాధపడుతున్న ప్రముఖ విప్లవ కవి వరవరరావును వెంటనే విడుదల చేయాలని..రాష్ట్రపతికి వైసీపీ ఎమ్మెల్యే లేఖ

Varavara Rao ను విడుదల చేయండి.. అప్పట్లో మన ముగ్గురం 21 నెలలు జైల్లో ఉన్నాం.. ఉప రాష్ట్రపతికి వైసీపీ ఎమ్మెల్యే లేఖ

వృద్ధాప్యంతో పాటు కరోనాతో బాధపడుతున్న ప్రముఖ విప్లవ కవి వరవరరావును వెంటనే విడుదల చేయాలని ఉప రాష్ట్రపతికి వైసీపీ ఎమ్మెల్యే భూమన లేఖ రాశారు.

మహారాష్ట్ర ముంబైలోని తలోజా జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ విప్లవ కవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.

ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు శనివారం బహిరంగ లేఖ రాశారు.

తీవ్ర అనారోగ్య సమస్యతో పాటు, ప్రాణాంతకర కరోనా వైరస్‌ బారిపడిన వరవరరావు విడుదలకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

శరీరం మంచాన కట్టుబడి 81 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

‘వృద్ధ శల్య శరీరంలో ఉన్న వరరరావు ప్రాణాలు కాపాడాలని ఉపరాష్ట్రపతిని కోరుతున్నా. వరవరరావు నిర్బంధం, అనారోగ్యం గురించి మీకు తెలిసే ఉంటుంది.

అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనల అంకుర్భావ దశలో నాకు లభించిన లభించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులు.

46 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు (వెంకయ్య నాయుడు), నేను (భూమన కరుణాకర్‌రెడ్డి) 21 నెలల పాటు ముషీరాబాద్ జైల్లో వున్నప్పుడు వరవరరావు మన సహచరుడు. సహచర్యం, భావాజాలం కాదు గాని జైల్లో కలసి ఉన్నాం.

రాజకీయ సిద్ధాంతాల్లో జనక్షేమం కోసం నడిచే మార్గాల్లో ఎవరి భావాలు వారివి.

కానీ మనం మనుషులం. మానవతా దృక్పథంతో స్పందించి వరవరరావు విడుదలకు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.

కాగా, ప్రముఖ విప్లవ కవి వరవరరావు (వీవీ)కు కోవిడ్‌ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయన్ను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

వీవీతో పాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొఫెసర్ జీఎన్‌ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు.

మరోవైపు వరవరరావు కరోనా సోకడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *