చంద్రబాబుకి ప్రజలంతా గుణపాఠం చెప్పడం గ్యారెంటీ

ఓటరుకి మండింది.. బాబుకి మూడింది

డాటా స్కామ్ తో లక్షల్లో ఓటర్లు రగిలిపోతున్నారు. తమ ప్రమేయం లేకుండా ఎవరో తమ తరపున అర్జీలు పెట్టుకుని ఓటు హక్కుని తొలిగిస్తున్నారని తేలడంతో ఓటుని కోల్పోయిన వారంతా ఆగ్రహంతో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో ఇదే ప్రధాన తిరుగుబాటుగా మారబోతోంది. తమ ఓటుకి ఎసరు పెట్టాలని చూసిన చంద్రబాబుకి ప్రజలంతా గుణపాఠం చెప్పడం గ్యారెంటీ.

గెలుపుపై ధీమాలేని వాళ్లు గతంలో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లేవారు, బాక్సుల్లో ఇంకు, నీళ్లు పోసి ఓట్లు పనికిరాకుండా చేసేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అసలు ఓటే లేకుండా చేస్తున్నారు.

రాష్ట్రంలో జగన్ వేవ్ ఉందని తెలిసిన తర్వాతే చంద్రబాబు ఈ దురాగతానికి ఒడిగట్టారు. తనయుడు లోకేష్ నేతృత్వంలో డాటా స్కామ్ కు శ్రీకారం చుట్టారు.

అస్మదీయుల ఓట్లను అలాగే ఉంచడం, తస్మదీయుల లిస్ట్ తీసుకుని ఏరివేత మొదలుపెట్టడం “ఆపరేషన్ ఓట్ల గల్లంతు” కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.

దీనికి టెక్నాలజీ సహాయం తీసుకున్నారు హైటెక్కు చంద్రబాబు. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగినట్టు.. పెదబాబు, చినబాబు.. ఓట్లు ఏరివేత ప్రారంభించారు.

గతేడాది మార్పులు చేర్పుల తర్వాత ఓటర్ లిస్ట్ బయటకి రావడంతో ప్రతిపక్షం గుండె పగిలింది. ఒక్కో నియోజకవర్గంలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు వేలకు వేలు మాయమైపోయాయి.

ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అలెర్ట్ అయ్యి ఆరాతీశారు. ఇది పొరపాటుగా కాదని, కక్షగట్టుకుని తమ ఓట్లను ఎవరో తొలగించారని అర్థమైంది.

అధినేత జగన్ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలసి జగన్ ఇప్పటికే ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు.

తాజాగా ఐటీగ్రిడ్ ఉదంతంతో ఓట్ల గల్లంతు చాలా పకడ్బందీగా జరుగుతుందనే విషయం బైటపడింది.

బాబు కుటిల పన్నాగం అంతా ప్రజల్లోకి వచ్చింది. ఈసారి గవర్నర్ కి ఫిర్యాదు చేసిన జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని అభ్యర్థించారు. తమ ఓట్లు తొలగించింది చంద్రబాబేనని ఇప్పటికే ప్రజలకు ఓ అవగాహన వచ్చింది.

ఓట్లు కోల్పోయిన వారే కాదు, ఈ ప్రహసనంతో బాబు నిజ స్వరూపం తెలిసిన వారంతా ఇప్పుడు టీడీపీపై రగిలిపోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఈ వ్యవహారం చంద్రబాబుకి చేటు తెచ్చే అవకాశం పుష్కలంగా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *