మసూద్‌పై నిషేధం విధించాల్సిందే.. ఐరాసపై అగ్రరాజ్యాలు ఒత్తిడి!

మసూద్‌పై నిషేధం విధించాల్సిందే.. ఐరాసపై అగ్రరాజ్యాలు ఒత్తిడి!
ఉప ఖండంలో ఉద్రిక్తతలకు కారణమైన మసూద్ అజర్‌ను నిషేధించాలని, అతడి ఆస్తులను జప్తు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు మరోసారి ప్రస్తావించాయి.

1.ఐరాస భద్రతా మండలిలో మసూద్ అంశాన్ని ప్రస్తావించిన అమెరికా.

2.జైషే మహ్మద్‌పై భారత్ తీసుకునే చర్యలకు సహకరిస్తామని హామీ.

3.మసూద్‌పై నిషేధం విధించాలని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ప్రతిపాదన.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైన జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్‌పై నిషేధం విధించాలంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి తీవ్రతరమవుతోంది.

ఈ అంశంలో పలు దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి.

మసూద్‌పై ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రవేసిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ విషయాన్ని ప్రస్తావించింది.

మసూద్‌పై నిషేధం విధించాలని ఐరాస భద్రతా మండలిని ఈ మూడు దేశాలూ కోరాయి.

భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు భారత్-పాక్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై స్పందించాయి.

ఉప ఖండంలో ఉద్రిక్తతలకు కారణమైన మసూద్ అజర్‌ను నిషేధించాలని, అతడి ఆస్తులను జప్తు చేయాలని కోరాయి.

ఈ ప్రతిపాదనపై ఐరాస భద్రతా మండలి పది పనిదినాలలో తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

కాగా, మసూద్‌ను మొదటి నుంచి వెనకేసుకొస్తున్న డ్రాగన్ చైనా సభ్య దేశాల ప్రతిపాదనపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిని చైనా వ్యతిరేకించే అవకాశం ఉంది.

ఎందుకంటే, గతంలో రెండుసార్లు మసూద్ అజార్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదనలను అడ్డుకుంది.

అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్ షానాహన్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ శాఖ సలహాదారు జాన్ బోల్టన్ సహ ఇతర అధికారులు సమావేశమై భారత్, పాక్ తాజా పరిస్థితులపై చర్చించారు.

ఇరు దేశాలూ సంయమనం పాటించాలని, తదుపరి సైనిక చర్యలకు ఉపక్రమించరాదని అమెరికా రక్షణ శాఖ మంత్రి విఙ్ఞ‌ప్తి చేసినట్టు పెంటగాన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

తాజా పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ ఫోన్‌లో మైక్ పాంపియో చర్చించారు. పాక్ భూభాగంలో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ తీసుకునే చర్యలకు అమెరికా మద్దతు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

మరోవైపు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ సమావేశానికి ఒకవేళ భారత్ హాజరైతే తాము రాబోమంటూ పాకిస్థాన్ బెదిరిస్తోంది. ఫిబ్రవరి 28న యూఏఈలో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

అలాగే మార్చి 1, 2 తేదీల్లో అబుదాబీ వేదికగా జరిగే విదేశాంగ మంత్రుల 46వ సమావేశాలకు ఆమె హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మాట్లాడుతూ.. ఐఓసీ సమావేశానికి ఒకవేళ సుష్మా స్వరాజ్ హాజరైతే తాము బహిష్కరిస్తామని హెచ్చరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *