అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఓట్ల తొలగింపు పై పరస్పర ఆరోపణలు

రేపో మాపో ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనగా రాష్ట్రంలో ఓట్ల తొలగింపు అక్రమాలు అమితంగా ప్రచారంలోకొచ్చి ప్రజల్లో సందేహాలు సంశయాలు పాదుకొల్పడం ఆందోళనకరం

ఈ గందరగోళం ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు కళంకం. అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఓట్ల తొలగింపులపై పరస్పర ఆరోపణలకు, పోలీస్‌ కేసులకు, భౌతిక దాడులకు దిగడంతో ఒక్కసారిగా రాష్ట్రం వేడెక్కింది.

టిడిపికి సేవా మిత్ర యాప్‌ను తయారు చేసిన హైదరాబాద్‌కు చెందిన ఐటి గ్రిడ్స్‌ సంస్థ వైసిపి సానుభూతి పరుల ఓట్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా తొలగిస్తోందంటూ సామాజిక కార్యకర్త ఒకరు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు చేసి కొన్ని కంప్యూటర్‌ పరికరాలను, నలుగురు ఉద్యోగులను విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.

తమ ఉద్యోగులను కిడ్నాప్‌ చేశారని ఐటి గ్రిడ్స్‌ డైరెక్టర్‌ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎపి పోలీసులు హైదరాబాద్‌ వెళ్లి ఐటి గ్రిడ్స్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటిపై దాడి చేశారు.

అంతలోనే తమ ఉద్యోగులు కిడ్నాప్‌కు గురయ్యారంటూ ఐటి గ్రిడ్స్‌ అధినేత తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ వేయగా సదరు ఉద్యోగులను తమ ముందు హాజరుపర్చాలని సైబరాబాద్‌ పోలీసులను కోర్టు ఆదేశించింది.

సోమవారం ఉద్యోగులను పోలీసులు కోర్టులో హాజరుపర్చడంతో విచారణ కోసమే పోలీసులు తీసికెళ్లారని నిర్ధారించి ఐటి గ్రిడ్స్‌ డైరెక్టర్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

కేసు హైదరాబాద్‌లో నమోదైనందున నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు జరుపుతున్నామని సైబరాబాద్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.

ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయేలా సహకరించాలి.

అభ్యంతరాలుంటే కోర్టులో సవాల్‌ చేయాలి. కానీ అధికార టిడిపి నేతల ఎవరి ఆరోపణలైనా తేలాల్సింది సమగ్ర దర్యాప్తుద్వారానే.

అధికార పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో పల్స్‌ సర్వే వివరాలన్నీ ఉన్నాయన్నది ఒక ఆరోపణ.

ప్రజల వ్యక్తిగత విషయాలు గోప్యంగా ప్రభుత్వం వద్ద ఉండవలసినవి సేవామిత్ర యాప్‌లో ఉంటే అది చాలా తీవ్రమైన విషయం.

అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

ప్రపంచ దేశాలన్నింటిలోకి మన ప్రజాస్వామ్యం ఉత్తమమైనదని చెప్పుకుంటాం.

ఎన్నికల వ్యవస్థలో కొన్ని లోపాలు పొడసూపినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొని అత్యధికంగా మద్దతు తెలిపిన పార్టీయే అధికారం చేపడుతోంది.

రిగ్గింగ్‌, దొంగ ఓట్లు వేయడం, సామాజిక అణచివేత వంటివి అక్కడక్కడ చోటు చేసుకున్నా ఎన్నికల ఫలితాలను అంతిమంగా నిర్ణయిస్తున్నది ప్రజాభిప్రాయమే.

కాగా సరళీకరణ విధానాలొచ్చాక ఎన్నికల చిత్రంలోకి ధన ప్రవాహం చొచ్చుకురానారంభించింది.

ఈ పాతికేళ్లల్లో బూర్జువా పార్టీల్లో వాస్తవ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఎలాగానా ఎన్నికల్లో గెలవాలన్న ధోరణి పెచ్చుమీరింది.

అందులో భాగంగానే డబ్బు, మద్యం, బహుమతులు, కార్పొరేట్‌ మీడియాలో పెయిడ్‌ న్యూస్‌ విచ్చలవిడి పెరిగింది.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పాలకవర్గ పార్టీలు నానా రకాల పనులకూ పాల్పడుతున్నాయి.

ప్రస్తుతం ఎపిలో ఓట్ల తొలగింపు ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట. ఇప్పటికైనా ఓట్ల అక్రమ తొలగింపు, చేర్పింపులపై ఇసి సమగ్ర విచారణ జరిపించాలి. బాధ్యులైన వారిని చట్ట పరంగా కఠినంగా శిక్షించాలి.

ప్రజల్లో నెలకొన్న అనుమానాలు అపోహలను పోగొట్టాలి. తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజల ఓటు హక్కును సైతం లేకుండా చేసే కుటిల రాజకీయాలకు ఎన్నికల కమిషన్‌ కచ్చితమైన చర్యల ద్వారా తెరదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *