వాళ్లు వలంటీర్లు కాదు, వారియర్స్.. సరిగ్గా ఏడాది క్రితం.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి జగన్ ట్విటర్ వేదికగా స్పందించారు.
ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ప్రజలకు వలంటీర్లు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు.
వలంటీర్ల మెరుగైన పనితీరును చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వలంటీర్లను.. గ్రామ వారియర్స్ (యోధులు)గా అభివర్ణించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, ప్రతి కుటుంబంలో చిట్టచివరి లబ్దిదారుల వరకు ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించే ప్రయాణాన్ని ప్రారంభించాం.
ఏడాది ప్రయాణంలో మెరుగైన పనితీరు కనబర్చిన మా విలేజ్ వారియర్స్ (#APVillageWarriors) కృషి అమోఘం. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు చేస్తున్న సేవల పట్ల గర్వంగా ఉంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే సెల్యూట్ చేస్తున్న ఫొటోను ఉంచారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థకు అంకురార్పన చేసిన విషయం తెలిసిందే.
ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను నియమించి.. ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు అందించేలా విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చారు.
ఈ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ వలంటీర్లకు అభినందనలు తెలిపారు.