నిడదవోలు జనసేన పార్టీ టికెట్ రేసులో యువ నాయకుడు కస్తూరి నాని

జనసేన పార్టీ తరఫున టికెట్లు ఆశించేవారి సంఖ్య భారీగానే కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో తొందరగా టికెట్లు ప్రకటిస్తే బాగుంటుందని మెజారిటీ నాయకుల అభిప్రాయం.

నిడదవోలు నియోజకవర్గ సీటును ఆశిస్తోన్న కస్తూరి నాని. జనసేన సీటుకు నాని అన్ని విధాల అర్హుడంటోన్న అనుచరులు నానికి సీటిస్తే సైనికుల్లా పనిచేస్తామంటోన్న జనసేన కార్యకర్తలు.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల మధ్య ద్విముఖ పోరు జరగగా.. ఈసారి మాత్రం త్రిముఖ పోరు జరగనుంది.

దీనికి కారణం జనసేన పార్టీ సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుండటమే. మొత్తం 175 స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అయితే ప్రస్తుతానికి నలుగురైదుగురు తప్ప అభ్యర్థులు ఎవరూ ఖరారు కాలేదు. దీంతో జనసేన పార్టీ తరఫున టికెట్లు ఆశించేవారి సంఖ్య భారీగానే కనిపిస్తోంది.

సమయం దగ్గరపడుతుండటంతో తొందరగా టికెట్లు ప్రకటిస్తే బాగుంటుందని మెజారిటీ నాయకుల అభిప్రాయం.

మరోవైపు అధినేత పవన్‌ను మెప్పించేందుకు ఇప్పటికే ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో నిడదవోలు నియోజకవర్గం నేత కస్తూరి సత్య ప్రసాద్(నాని) కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ గుర్తు గాజు గ్లాసుతో కస్తూరి నాని

జనసేన పార్టీ ఏర్పడిన నాటి నుంచి నిడదవోలు నియోజకవర్గంలో కస్తూరి నాని యాక్టివ్‌గా పనిచేస్తున్నారు.

కేవలం పార్టీ రూపొందించిన కార్యక్రమాలే కాకుండా తన అనుచరుల సహాయంతో నాని కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు.

వాటిలో ప్రధానమైంది ‘రెడ్ రెవల్యూషన్’. గ్రామాల్లో ఉన్న సమస్యలను అందరికీ తెలిసేలా ఆయా గ్రామాల్లో తెల్లని గోడపై ఎర్రటి అక్షరాలతో రాయించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కూడా అందుకున్నారు. మొదట్లో తాను ఎమ్మెల్యే సీటును ఆశించి ఇదంతా చేయడం లేదని, కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చేస్తున్నానని నాని చెప్పారు.

అయితే ఆయన అనుచరులు మాత్రం నానిని ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు.

దీంతో నాని కూడా పునరాలోచనలో పడ్డారని, ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

సమస్యలు తెలుసుకుంటోన్న నాని

కస్తూరి నాని ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారని, స్థానికుడు కాబట్టి తమ నాయకుడికి తప్పకుండా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయిస్తారని నాని అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి తమ నాయకుడు పార్టీలో కొంత మంది యువకులను సంఘంగా తయారుచేసి ‘రెడ్ రెవల్యూషన్’ అనే పేరుతో పార్టీ ఆధ్వర్యంలో ఓటు సభ్యత్వాలు చేయించారని కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.

అంతేకాకుండా, అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని పటిష్ట పరిచే దిశగా జనసేన పోరాట యాత్రలో తమ నాయకుడు పాల్గొన్నారని.. జన తరంగం, జనబాట కార్యక్రమాలను దిగ్విజయంగా చేసి చూపించారని అంటున్నారు.

అక్కడితో ఆగకుండా ‘అంబేద్కరిజం’ అనే నినాదంతో నియోజకవర్గంలోని అన్ని దళితవాడల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని, వాటిని ఉన్నతాధికారులకు తెలిసేలా చేసి అవి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తూ ప్రజలకు చేరువయ్యారని చెబుతున్నారు.

తమ నాయకుడు నానికి జనసేన టికెట్ ఇస్తే తామంతా సైనికులుగా పనిచేసి ఆయన్ని గెలిపించి పార్టీకి అంకితం ఇస్తామని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

వాస్తవానికి నిడదవోలు నియోజకవర్గం నుంచి మరో నేత కూడా టికెట్ రేసులో ఉన్నారు.

మరి అధినేత పవన్ కళ్యాణ్ ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *