జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంటే..రాజధాని ఎలా మారుస్తారు.. వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోళ్లు రాజధాని ఎలా మారుస్తారు.. వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

ఏపీ 3 రాజధానులపై అధికార వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంటే, రాజధానిని ఎలా మార్పు చేస్తారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలు మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోతే తీవ్రంగా నష్టపోతామని పేర్కొన్నారు.

ఢిల్లీలో శుక్రవారం ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించండం మంచి పరిణామమన్నారు.

కొందరు నేతలు హైకోర్టుపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరితే బాగుంటుందన్నారు.

ఒక మాజీ న్యాయాధికారి సంభాషణలు బయటకు వచ్చాయని.. అలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి మంచిది కాదని ఎంపీ రఘురామ హితవుపలికారు.

న్యాయస్థానాలను అందరూ గౌరవించాలన్నారు. అలాగే రాజధానిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.

అమరావతిలో రాజధాని వస్తుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా మంది చిన్నచిన్న ఫ్లాట్స్‌ కొనుక్కున్నారని, దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కసారి ఇలాంటి విషయాలపై కూడా ఆలోచించాలని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కూడా అమరావతిలో స్థలాలు కొనుక్కున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదన్నారు.

రైతులకు న్యాయం చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని, రాజధాని తరలించి రైతులకు ఏవిధంగా న్యాయం చేయగలరని ప్రశ్నించారు.

అమరావతి కన్నీటి వెతలు ఇంకెన్నాళ్లు? రాజధాని లేకుండా రైతుల కష్టాలు ఎలా తీరుస్తారు? అని రఘురామ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *