‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ పేరుతో ఉన్న ఈ నేమ్ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జగన్ అనే నేను.. ఏపీ సీఎంగా నేమ్ బోర్డ్ సిద్ధం? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయం ఖాయమైందా?

ఆయన సీఎం పదవి చేపట్టనున్నారా?

ఫలితాల మాట ఎలా ఉన్నా.. వైసీపీ, టీడీపీలు మాత్రం విజయం తమదే అనే ధీమాతో ఉన్నాయి.

ఈ తరుణంలో ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అనే నేమ్ బోర్డ్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఈ నేమ్‌బోర్డ్ చూసిన కొంతమంది వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, సోషల్ మీడియాలో వచ్చేవీ ఏవీ పూర్తిగా నమ్మలేం.

ఈ నేమ్‌బోర్డును ఖచ్చితంగా వైసీపీ వారే తయారు చేయించారనే గ్యారంటీ కూడా లేదు. అలాగని కొట్టిపారేయం లేం కూడా. ఎందుకంటే.. ఈసారి ఎన్నికల్లో జగన్ తప్పకుండా సీఎం అవుతారని వైసీపీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ముందుగా సన్నహాలు చేసుకోవడంలో తప్పులేదనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నేమ్ బోర్డును సిద్ధం చేసుకుని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే, మే 23న ఫలితాలు వెల్లడయ్యే వరకు ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయాన్ని చెప్పలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీలో అత్యధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లు ఎటు మొగ్గారనేది సస్పెన్స్.

అయితే, ఓటింగ్ సరళి అంచనాల ప్రకారం వైసీపీ శ్రేణులు తమదే విజయమని, ఈసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

100 సీట్లకు పైనే వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు.

జగన్ కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో జగన్ తమ విజయం దాదాపు ఖరారైందని పేర్కొన్నారు.

2024లో కూడా పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయాలని కోరారు. అలాగే పాలనలో కూడా తన వంతు సలహాలు, సూచనలు అందించాలన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన నేమ్‌బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమా? ఫేకా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed