బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయం:వైసీపీ అధినేతజగన్

నోటిఫికేషన్ వెల్లడికి ముందే వైసీపీ జాబితా!
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు విధి, విధానాలు రూపొదించుకుని అస్త్రశస్త్రాలతో రణక్షేత్రంలోకి దూకడానికి సిద్దంగా ఉన్నాయి.

అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై వైసీపీ అధినేత కసరత్తు.
నోటిఫికేషన్‌కు ముందే జాబితాను ప్రకటించాలని జగన్ యోచన.
బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయం.

ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యనేతలతో ఆదివారం భేటీ అయ్యారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే పార్టీలో చేరికల పర్వాన్ని ముగించాలని నేతలకు జగన్ సూచించినట్లు సమాచారం. పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నదెవరు? టికెట్ల విషయంలో వారి డిమాండ్లు ఏంటి? అనేది కొలిక్కి తెస్తే అభ్యర్థులను ఖరారు చేద్దామని వెల్లడించినట్టు తెలుస్తోంది.

మరోవైపు, కాకినాడలో సోమవారం జరిగే సమర శంఖారావం కార్యక్రమంపై కూడా చర్చించారు. సర్పవరం పూలమార్కెట్‌‌లోని మైదానంలో ఈ సభకు ఏర్పాట్లు చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు అక్కడకు చేరుకుని, ముందుగా భాస్కరవర్మ కల్యాణ మండపంలో ప్రముఖులు, మేధావులు, తటస్థులతో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.

అనంతరం సమర శంఖారావం వేదిక వద్దకు చేరుకుని బూత్‌ కమిటీల కన్వీనర్లు, సభ్యులు, గ్రామ, మండల, రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తారు.

ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత తొలి సభ కావడంతో ఇదే వేదికపై నుంచి జగన్‌ ఎన్నికల సమర శంఖం పూరిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

ఇక, మార్చి 14, లేదా 15 నుంచి బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోన్న వైసీపీ అధినేత, దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

తన పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని 134 నియోజకవర్గాలను పర్యటించిన జగన్, మిగతా 41 చోట్ల బస్సు యాత్ర చేపట్టునున్నారు. తర్వాత పరిస్థితులను బట్టి ఇతర నియోజకవర్గాల్లో దీనిని కొనసాగించనున్నారు.

బస్సు యాత్ర ప్రారంభానికి ముందే అభ్యర్థులను ప్రకటించాలా? లేదా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రోజు మొత్తం అభ్యర్థులను ప్రకటించడమా? అనే అంశంపై చర్చించారు. ఒకవేళ తొలి విడతగా జాబితా ప్రకటిస్తే 100 నుంచి 120మంది పేర్లు అందులో ఉంటాయని తెలుస్తోంది.

మరోవైపు సినీ నటుడు అలీ సోమవారం జగన్‌తో భేటీ కానున్నారు. ఆయన వైసీపీలో చేరి గుంటూరు నుంచి పోటీచేస్తారనే ప్రచారం సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *