ఫిబ్రవరిలోనే మండుతోన్న భానుడు.. ఏడేళ్లలో ఇదే తొలిసారి…

తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి మాసం లోనే ఎండలు మండిపోతున్నాయి. రెండో వారం నుంచి భానుడు ప్రతాపం చూపడంతో ఎండ వేడిమికి జనం హడలెత్తిపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరిలోనే మండిపోతున్న ఎండలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు. గత పదేళ్లలో 2009, 2012లో ఫిబ్రవరి నెలలోనే ఇలాంటి పరిస్థితి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకూ చలికి వణికిపోయిన జనం ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా భానుడు భగభగలు ఏమాత్రం తగ్గడం లేదు.

తెలంగాణతోపాటు ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో 40డిగ్రీల లోపు, కోస్తాలో 33-38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉష్ణోగ్రతలు ఇంతటి తీవ్ర స్థాయిలో గత పదేళ్లలో 2009లోనూ, 2012లో మరోసారి ఫిబ్రవరి నెలలోనే కనిపించాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్ర ప్రజలను ఠారెత్తిస్తున్నాయి.

సోమవారం తిరుపతిలో అత్యధికంగా 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, గత పదేళ్లలో ఇక్కడ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది రెండోసారి.

2009లో ఫిబ్రవరి నెలలో 39.5డిగ్రీలు నమోదు కాగా తాజా ఉష్ణోగ్రత దీన్ని అధిగమించింది. అలాగే కర్నూలులో 39.6, అనంతపురంలో 39 డిగ్రీలు నమోదైంది. కోస్తాలో అత్యధికంగా నందిగామలో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

హైదరాబాద్‌ నగరంపై కూడా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దక్షిణాది నుంచి వీస్తున్న వేడిగాలులతో నగరంలో వాతావరణం వేడెక్కింది.

ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీల వరకు ఎక్కువ నమోదవుతున్నాయి.

ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 37 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. రాత్రిపూటా వాతావరణం వేడిగానే ఉంటోంది.

సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా 21 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

వాతావరణం పొడిగా ఉండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని.. నెలాఖరుకే 39 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

గత ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యధికం 35.1 మాత్రమే. అదీ నెలాఖరున నమోదైంది. ఇక, మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలపై అంచనా రిపోర్టు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌, మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాజిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *