వైఎస్ జగన్ వయస్సు చిన్నదని.. కానీ, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత పెద్దదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు…

జగన్ 3, 4 టర్మ్‌లు సీఎంగా ఉండాలి.. ఏపీ గడ్డపై కేసీఆర్ కీలక ప్రసంగం.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ సభికులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

వైఎస్ జగన్ వయస్సు చిన్నదని.. కానీ, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత పెద్దదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.

గురువారం (మే 30) మధ్యాహ్నం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇదొక అరుదైన ఘట్టమని.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇకపై చేయాల్సింది ఖడ్గచాలనం కాదని.. కరచాలనమని చెప్పారు.

‘మీ అందరి ప్రేమ, అనురాగం, ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బద్దమైన పదవి చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ, యువ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక అభినందనలు.

తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదొక ఉజ్వలమైన ఘట్టం.

ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని బలంగా నమ్ముతున్నా’ అని కేసీఆర్ అన్నారు.

‘ముఖ్యమంత్రి గారి వయస్సు చిన్నది. కానీ, బాధ్యత పెద్దది. ఆ బాధ్యతను అద్భుతంగా నెరవేర్చే శక్తి జగన్‌కు ఉందని నేను బలంగా నమ్ముతున్నా.

తనకు అద్భుతమైన శక్తి, ధైర్యం, సామర్థ్యం ఉందని గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రస్ఫూటంగా నిరూపించారు.

తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని విశ్వసిస్తున్నా’ అని కేసీఆర్ అన్నారు.

ఏపీ గడ్డపై కేసీఆర్ కీలక ప్రసంగం

జగన్ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని.. ఆయన సంపూర్ణ విజయం సాధించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

కృష్ణా, గోదావరి జలాలను సంపూర్ణంగా వాడుకుందామని పిలుపునిచ్చారు.

‘ఇలాంటి తరుణంలో రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలు, రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం.

ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలను రాబట్టాలి’ అని కేసీఆర్ అన్నారు.

తనకు తెలిసి జగన్‌ ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగమేనని కేసీఆర్ చెప్పారు.

వంద శాతం అది జరిగి తీరాలని.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరుగుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. కేసీఆర్, జగన్ ‘కృష్ణా నదిలో మనకు సమస్యలు ఉన్నాయి.

అక్కడ లభించే నీటి బొట్టును ఒడుపుగా, ఒద్దికగా, ఓపికగా ఉభయ రాష్ర్టాల ప్రజలు కలిసి వినియోగించుకుంటూనే సంవృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని మనసారా కోరుకుంటున్నా.

ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమైన అండదండలు సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఈ సందర్భంగా తెలుపుతున్నా..’ అని కేసీఆర్ అన్నారు.

జగన్‌కు ఏపీ ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారని.. దాన్ని సద్వినియోగం చేసి ఆయన తన తండ్రి పేరు నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయేలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ఒక్క టర్మ్ కాదు.. కనీసం మూడు, నాలుగు టర్మ్‌ల వరకు జగన్ పరిపాలన రాష్ట్రంలో కొనసాగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. జగన్‌కు శుభాశీస్సులు అందిస్తూ ప్రసంగం ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *