టీడీపీ ఎమ్మెల్సీల్లో.. అంతర్మథనం… ఆందోళన…

విజయవాడ, హైదరాబాద్‌లో రహస్య సమావేశాలు, అంతర్గత చర్చలు… శాసన మండలి రద్దు భయంతో రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన 
చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆవేదన
చైర్మన్‌తో తప్పు చేయించి పెద్దల సభను బాబు అగౌరవపర్చారు
సీఎంకు మండలి రద్దు చేసే అధికారం లేదని చెప్పడం మభ్యపెట్టడానికే
కేంద్రం ఒప్పుకోదన్న బాబు ప్రకటన కేవలం రాజకీయ వ్యూహమే..

అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం తప్పక ఆమోదించాల్సిందే.. 
గతంలో ఎన్టీఆర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఆమోదించడాన్ని గుర్తుచేస్తున్న వైనం 

టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం తమను మోసగిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై వారు మండిపడుతున్నారు. శాసనమండలి రద్దును కేంద్రం ఒప్పుకోదంటూ వ్యూహాత్మకంగా మాట్లాడుతూ, తమను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్సీలు రహస్యంగా సమావేశమై వారి రాజకీయ భవిష్యత్‌పై రెండ్రోజులుగా చర్చిస్తున్నారు. 

చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి
పార్టీ కోసం త్యాగాలు చేస్తే అండగా ఉంటానని బాబు చెప్పే మాటలన్నీ గండం గట్టెక్కేవరకేనని, ఆ తర్వాత పార్టీలో తమను ఎవరూ పట్టించుకోరనే అంశంపై ఎమ్మెల్సీలు తీవ్ర సమాలోచనలు జరుపుతున్నారు. ‘పార్టీ అధినేత తీరుతో సమస్య మరింత జటిలమవుతోంది.. పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్తు కనిపించడం లేదు.. ఐదేళ్లలో రాజధానిని కనీసం పునాదులు కూడా దాటించలేని పరిస్థితే ఇప్పుడు దీనికి కారణమైంది.. జనం నమ్మే పరిస్థితే లేదు.. ఐదేళ్లూ ఏమీ చేయకుండా ఇప్పుడు రాజధాని తరలిస్తున్నారని గగ్గోలు పెట్టడాన్ని విజయవాడ ప్రజలు కూడా పట్టించుకోకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది’ అని టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు గురువారం విజయవాడలోని ఓ హోటలో జరిగిన అంతర్గత సమావేశంలో ఇతర నేతలతో గట్టిగా వాదనకు దిగినట్టు తెలిసింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమల అభివృద్ధికి మనం వ్యతిరేకమనే సందేశం వెళ్లిపోయిందని.. కేవలం 29 గ్రామాల పార్టీగా మాత్రమే నిలిచిందని ఆ సమావేశంలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. రెండ్రోజులుగా హైదరాబాద్, విజయవాడలో పలువురు ఎమ్మెల్సీలు రహస్యంగా సమావేశమై ఏం చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడ్డారు.

ఇప్పటికే భారీ వ్యతిరేకత మూటగట్టుకున్నాం
చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని శాసన మండలిని చంద్రబాబు అగౌరవపర్చారని, మండలి ప్రతిష్టను దిగజార్చారంటూ మండలిలో టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసి, టీడీపీని వీడిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటుచేసే బిల్లును వెనక్కి పంపడంతో ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నామని, పేద ప్రజలు కోరుతున్న ఇంగ్లీష్‌ మీడియం బిల్లును తిప్పి పంపి అప్రతిష్ట పాలయ్యామని, ప్రజలకు మేలు చేసే చట్టాలను అడ్డుకుని ఏం సాధించామని ఆమె ప్రశ్నించారు. మూడు రాజధానులను రాష్ట్రమంతా స్వాగతిస్తున్నారని, ప్రజల్లో దానిపై సానుకూలత వ్యక్తమవుతుంటే.. అందుకు సంబంధించిన బిల్లుల్ని అడ్డుకోవడం ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకతను కొనితెచ్చుకున్నామని ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

మండలి చైర్మన్‌ తాను తప్పు చేస్తున్నానంటూనే.. పార్టీకి అనుకూలంగా రెండు బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకుని చట్టసభల ఔన్నత్యాన్నే భ్రష్టుపట్టించారని, రాజకీయం కోసం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారుతుందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిపోయిందని రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదనగా చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనులను రాజకీయ స్వలాభం కోసం వ్యతిరేకించి, ప్రతిదాన్ని తెగేవరకూ లాగి.. మండలి రద్దు వరకూ తీసుకొచ్చిన చంద్రబాబు తమ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఆ ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

బాబు హామీలన్నీ మభ్యపెట్టేందుకే
మండలిని రద్దు చేసే అధికారం సీఎంకు లేదని, రద్దుకు తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని, ఒకవేళ రద్దయినా మళ్లీ తాను అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలి రద్దు అధికారం సీఎంకు లేకపోతే ఇక ఎవరికి ఉంటుందని, గతంలో ఎన్టీఆర్‌ మండలిని రద్దు చేశారు కదా! అనే వాదన ఆ పార్టీ ఎమ్మెల్సీలే గుర్తుచేస్తున్నారు. మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం ఆమోదించదని, తాను ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకులతో టచ్‌లో ఉండి మాట్లాడుతున్నానంటూ చంద్రబాబు.. తమను నమ్మించడానికి నానాపాట్లు పడుతున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నేత చెప్పారు. ‘మండలిలో చైర్మన్‌ వైఖరిని బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది. అలాంటప్పుడు బాబు చెప్పే మాటలను ఎంతవరకు నమ్మాలి? ఇది మనల్ని మభ్యపెట్టడానికి కాదా?’ అని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.

కేంద్రానికి ప్రస్తుతం తమ పార్టీతో అవసరం లేదని, వారికి అవసరమయ్యే బలం తమకు లేదని కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు దేశమంతా తిరిగి మోదీ, అమిత్‌షాను తిట్టి, వారిని ఓడించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపి.. దేశ రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తిగా ముద్రపడిన చంద్రబాబు వైఖరిని ఢిల్లీలో కమలనాథులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ‘పార్టీకి మిగతా ప్రాంతాల్లో నష్టం జరుగుతోందని స్పష్టంగా తెలిసినా, అమరావతిలో ఆయన ఆస్తులు, బినామీల భూముల కోసమే ఇదంతా చేస్తుంటే.. దానికి మనం బలికావాలా?’ అని రహస్య సమావేశంలో పలువురు ఎమ్మెల్సీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచినట్లు తెలుస్తోంది.

బిల్లు అడ్డుకునే అవసరం కేంద్రానికి లేదు..
‘ఒక రాష్ట అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపితే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వాలు దానిని అంగీకరిస్తాయి. మండలి కొనసాగినా, రద్దయినా బీజేపీకి ప్రయోజనం పెద్దగా ఉండదు. అలాంటిది బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా.. మండలి రద్దును వ్యతిరేకించడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదని తెలిసీ ఎందుకు అడ్డుకుంటారు?’ అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో బలంగా సాగుతోంది. ‘వైఎస్‌ జగన్‌ అంటే ఏమిటో పదేళ్లుగా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.. ఇన్నాళ్లూ బాబు ఏం చేశారో జనం చూశారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరి విశ్వసనీయత ఏంటనేది మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టంగా తేల్చారు’ అని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు.. ఒక మాటిస్తే దానిపై నిలబడే వ్యక్తిగా జగన్‌మోహన్‌రెడ్డి.. వీరిద్దరిలో ఎవరి వ్యక్తిత్వం ఏంటనేది బీజేపీపాటు ఇతర జాతీయ పార్టీల అధినేతలందరికీ తెలుసనే చర్చ సాగుతోంది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో దేశంలోనే బలమైన నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవసరం బీజేపీకి ఉందనే విషయం కొందరు టీడీపీ ఎమ్మెల్సీల మధ్య చర్చకు వచ్చింది.

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి ఇప్పటికే రెండు స్థానాలుండగా త్వరలో జరిగే ఎన్నికల్లో వచ్చే నాలుగు స్థానాలతో వారి సంఖ్య ఆరుకు పెరగనుంది. ఈ నేపథ్యంలో జగన్‌కు  వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు వ్యవహరిస్తుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. శాసనమండలి రద్దు అనేది కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. ఇలాంటి సాధారణ విషయాలపై కేంద్రం బలమైన రాష్ట్ర ప్రభుత్వంతో విభేదం తెచ్చుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదని చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా తమ అధినేతను మోదీ, అమిత్‌షా పట్టించుకునే అవకాశం లేదని, చంద్రబాబు చెప్పే మాటలన్నీ భయంతో ఉన్న తమను నిలబెట్టుకునేందుకేననే అభిప్రాయాన్ని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ అధికారమా.. ! బాబు మాటలన్నీ అబద్ధాలే
వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని బట్టి.. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మాటమీద నిలబడతారని, ఈ విషయం ఇప్పటికే పలు అంశాల్లో స్పష్టమైందని టీడీపీ నేతలే అంటున్నారు. మండలి రద్దు చేసినా, మళ్లీ తాను వచ్చాక పునరుద్ధరిస్తాననే చంద్రబాబు మాటల్ని విని నవ్వొస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు. శాసనమండలి అవసరమే లేదని, దానివల్ల సమయం, ప్రజాధనం వృథా అని 2004లో చెప్పిన తమ అధినేత ఇప్పుడు శాసన మండలిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకోవడం, మండలి పరిణామాల నేపథ్యంలో అది ఇంకా పెరగడం, మరోవైపు పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా చెల్లాచెదురై, ఎమ్మెల్యేలను కూడా నిలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడమనేది కలనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి గేట్లు తెరిస్తే ఈ పాటికే ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీకి క్యూకట్టే వారని, తమ అధినేతకు ప్రతిపక్ష హోదా ఎప్పుడో పోయేదని ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును నమ్ముకుని మునిగిపోయే పరిస్థితి తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం..
మండలి ఛైర్మన్‌గా ఉన్న ఎంఏ  షరీఫ్‌ సహా 15 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం 2021 మార్చి నుంచి జూన్‌ మధ్య ముగుస్తుంది. లోకేష్‌ సహా 12 మందికి 2023 మార్చి నుంచి జులై వరకూ పదవీకాలం ఉంది. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడుతోపాటు మరో ముగ్గురికి 2025 మార్చి వరకూ పదవీకాలం ఉంది. మండలి రద్దయితే వీరందరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *